అంతా సవ్యంగా సాగేనా?

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-29 06:21:30

  • భారత్‌లో బంగ్లా టూర్‌పై అనిశ్చితి
  • పలువురు ఆటగాళ్ల అనాసక్తి
  • ఇప్పటికే తమీమ్‌ దూరం
  • అదే దారిలో షకీబల్‌!

కీలక భారత పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో నెలకొన్న సంక్షోభం తరచూ వార్తల్లో నిలుస్తోంది. అదను చూసి దెబ్బ కొట్టాలన్నట్టుగా షకీబల్‌ ఆధ్వర్యంలో ఆటగాళ్లంతా పలు డిమాండ్లపై సమ్మెకు దిగడం.. గతిలేని పరిస్థితిలో ఆమోదిస్తున్నట్టుగా బంగ్లా క్రికెట్‌ బోర్డు కూడా మెట్టు దిగాల్సి వచ్చింది. అయితే ఆటగాళ్ల సమ్మె వెనక కుట్ర దాగుందని, అసలు సినిమా మున్ముందు కనిపిస్తుందని స్వయానా బీసీబీ అధ్యక్షుడే చెబుతుండడం ఇక్కడ మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో మరో రెండు రోజుల్లో ఆ జట్టు భారత్‌లో పర్యటన సస్పెన్స్‌గా మారింది.

ఢాకా: పలు డిమాండ్లతో హఠాత్తుగా సమ్మెకు దిగిన ఆటగాళ్లతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) సంధి కుదుర్చుకుని దాదాపు వారం రోజులైనా పరిస్థితి అంత సజావుగా ఏమీ లేదు. అసలు బంగ్లా జట్టు భారత్‌లో పర్యటించకుండా వెన్నుపోటు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ ప్రకటించడం సంచలనం రేపింది. అందులో భాగంగానే ఊహించని విధంగా ఆటగాళ్ల సమ్మె తెరపైకి వచ్చిందని ఆయన వాదిస్తున్నారు. అలాగే కొంతమంది ఆటగాళ్లు కూడా టూర్‌ నుంచి తప్పుకోవచ్చని చూచాయగా చెప్పారు. అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్‌ స్థాయి ఆటగాళ్ల వేతనాల పెంపు వంటి 11 డిమాండ్లతో కెప్టెన్‌ షకీబల్‌ హసన్‌ నేతృత్వంలో కీలక ఆటగాళ్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్లకు బీసీబీ అంగీకారం తెలపడంతో ఇక బంగ్లా జట్టు భారత్‌లో పర్యటించేందుకు ఎలాంటి అడ్డంకీ లేదని అంతా భావించారు. నాలుగు వారాల పాటు సాగే ఈ పర్యటనలో భారత్‌తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారమైతే బంగ్లా జట్టు బుధవారం న్యూఢిల్లీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. ‘భారత పర్యటన గురించి మీడియాకు ఇంకా ఏమీ తెలీదు. కొద్ది సమయం వేచి ఉండండి. ఈ టూర్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నా దగ్గర సమాచారం ఉంది. ఇదే విషయాన్ని మీరు కూడా నమ్ముతారు. ఎందుకంటే తమీమ్‌ ఇక్బాల్‌ ఇప్పటికే టూర్‌కు దూరమయ్యాడు. అయితే భార్య డెలివరీ కారణంగా అతడు మొదట్లో కేవలం చివరి టెస్టు మాత్రమే ఆడనని నాతో చెప్పాడు. కానీ ఆటగాళ్లతో సమావేశమయ్యాక మొత్తం టూర్‌కే వెళ్లనని మాట మార్చాడు. ఇదేకాదు చివరి నిమిషాల్లో మరికొంతమంది కూడా తప్పుకొన్నా నేనేమీ ఆశ్చర్యపోను. అసలు వారి డిమాండ్లను అంగీకరించడమే నేను చేసిన తప్పు’ అని నజ్ముల్‌ అన్నారు.

షకీబల్‌ కూడా దూరమేనా?

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబల్‌ హసన్‌ కూడా భారత పర్యటనకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సమ్మెకు నేతృత్వం వహించిన అతడు ఇప్పటికే బ్రాండ్‌ అంబాసిడర్‌ విషయంలో బీసీబీ రూల్స్‌ను అతిక్రమించినందుకు మందలింపునకు గురయ్యాడు. తాజాగా జట్టు మూడు రోజులపాటు చేసిన ప్రాక్టీ్‌సలో ఒక్కసారే హాజరయ్యాడు. ‘మా ఆటగాళ్లు భారత్‌కు వెళ్లరనే అనిపిస్తోంది. ముఖ్యంగా షకీబల్‌పై నాకు అనుమానంగా ఉంది. మేమేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు మాకు సమాచారం ఇస్తారేమో. షకీబల్‌తో సమావేశం కాదలుచుకున్నా. అతడేం చెబుతాడో వినాలి. ఒకవేళ ఈనెల 30నే మేం వెళ్లబోమని చెబితే నేనేం చేయాలి? అసలు కెప్టెన్‌ను ఎక్కడి నుంచి తేవాలి? మొత్తం కాంబినేషన్‌నే మార్చుకోవాల్సి ఉంటుంది’ అని నజ్ముల్‌ ఆవేదన వెలిబుచ్చారు. తమీమ్‌తో పాటు వెన్నునొప్పి కారణంగా మహ్మద్‌ సైఫుద్దీన్‌ కూడా ఈ టూర్‌కు దూరమయ్యాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD