అందరి కళ్లూ.. ఆ ఇద్దరిపైనే

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-02 04:44:09

img

  • ఓపెనర్‌గా రోహిత్‌, కీపర్‌గా సాహా
  • దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టెస్టు నేటినుంచి

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తిరుగులేని ఆటగాడిగా పేరు తెచ్చుకున్న రోహిత్‌ శర్మ తన సుదీర్ఘ కెరీర్‌లో మరో కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో తడబడుతూ సాగుతున్న కెరీర్‌ను పటిష్ఠం చేసుకోవడంతోపాటు ఓపెనర్‌గా నిరూపించుకునేందుకు సై అంటున్నాడు. అయితే వామప్‌ మ్యాచ్‌లో డకౌటైనా దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీ్‌సలో తన మార్కును చూపించాలనుకుంటున్నాడు. ఇక అన్ని ఫార్మాట్లలో వరుసగా విఫలమవుతున్న కీపర్‌ రిషభ్‌ పంత్‌ స్థానంలో 22 నెలల తర్వాత వృద్ధిమాన్‌ సాహా టెస్టు ఆడబోతున్నాడు. దీంతో నేటి నుంచి జరిగే తొలి టెస్టులో ఈ ఇద్దరిపైనే అందరి దృష్టీ నెలకొంది.

విశాఖపట్నం (స్పోర్ట్స్‌): ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌పలో తమ అగ్రస్థానాన్ని మరింతగా పటిష్ఠం చేసుకునేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో బుధవారం నుంచి జరిగే తొలి టెస్టులో దక్షిణాఫ్రికాతో తలడపనుంది. అటు సఫారీలకు టెస్టు చాంపియన్‌షి్‌పలో ఇదే తొలి మ్యాచ్‌. నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్న టీమిండియాను.. అదీ స్వదేశంలో ఓడించాలంటే శక్తికి మించిన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. స్టెయిన్‌, ఆమ్లా లేకుండా పర్యాటక జట్టు బరిలోకి దిగబోతుండగా.. ఇటు భారత జట్టు రోహిత్‌ శర్మ రూపంలో ప్రయోగానికి తెర తీసింది. ఓపెనర్‌గా అతడికి తగిన అవకాశాలిస్తామని కెప్టెన్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. మరి ఈ కొత్త పాత్రలో అతడు సంప్రదాయక ఆటతీరును కనబరుస్తాడా.. లేక మరో సెహ్వాగ్‌ను తలపిస్తాడా? అనేది వేచిచూడాల్సిందే. మ్యాచ్‌కు ముందే భారత్‌ తమ తుది జట్టును ప్రకటించగా పంత్‌ స్థానంలో సాహాను తీసుకున్నారు.

బ్యాటింగ్‌ బలం పెరిగింది: విజయనగరంలో జరిగిన మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌లో రోహిత్‌ ఓపెనింగ్‌ కేవలం రెండు బంతుల్లోనే ముగిసింది. అయితే అతడి సత్తాకు ఆ మ్యాచ్‌ కొలమానం కాకపోయినా అసలు సిసలైన సమరంలో తానేమిటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికే అతడికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కుదురుకునేందుకు తగిన అవకాశాలిస్తామన్న కెప్టెన్‌ భరోసాతో అతడు చెలరేగే అవకాశం ఉంది. ఇక తుది జట్టును ఇప్పటికే ప్రకటించగా తొమ్మిదో నెంబర్‌ వరకు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది. జట్టులో జడేజా, అశ్విన్‌ వరకు బ్యాటింగ్‌ చేయగలిగే వారే. కోహ్లీ, రహానె ఫామ్‌లో ఉండగా విండీస్‌ పర్యటనలో పుజారా విఫలమయ్యాడు. ఇప్పుడతడు ధారాళంగా పరుగులు సాధించాల్సిన అవసరం ఉంది. ఎట్టకేలకు పంత్‌పై వేటు పడడంతో ఫామ్‌లో ఉన్న సాహాకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ మ్యాచ్‌లో ఆకట్టుకుంటే ఇక టెస్టుల వరకు అతడి స్థానానికి ఢోకా లేనట్టే. మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ ప్రధాన పేసర్లు కాగా జడేజా, అశ్విన్‌ స్పిన్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ విహారి ఐదో బౌలర్‌గానూ సేవలందించనున్నాడు.

అనుభవలేమితో సఫారీలు: ఓవైపు ఫేవరెట్‌గా భారత్‌ బరిలోకి దిగుతుండగా అటు సఫారీలు మాత్రం తమ తుది జట్టుపై కసరత్తు చేస్తోంది. డుప్లెసి సారథ్యంలోని ఈ జట్టులో ఐదుగురికి మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. దీంతోపాటు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అనుభవలేమి లోపంగా మారింది. వామప్‌ మ్యాచ్‌లో మార్‌క్రమ్‌, బవుమా రాణించగలిగారు. వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ పేస్‌ త్రయం రబాడ, ఫిలాండర్‌, ఎన్‌గిడి భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. స్పిన్నర్లు కేశవ్‌ మహరాజ్‌, డేన్‌ పీట్‌ ప్రభావం చూపిస్తే జట్టుకు లాభమే.

1 స్వదేశంలో భారత్‌ వరుసగా 10 టెస్టు సిరీస్‌ విజయాలతో ఆసీస్‌తో కలిసి టాప్‌లో ఉంది. ఇప్పుడీ సిరీస్‌ విజయంతో రికార్డుపై కన్నేసింది.

జట్లు

భారత్‌ (తుదిజట్టు): రోహిత్‌, మయాంక్‌, పుజారా, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, విహారి, సాహా, జడేజా, అశ్విన్‌, ఇషాంత్‌, షమి.

దక్షిణాఫ్రికా (అంచనా): మార్‌క్రమ్‌, ఎల్గర్‌, డి బ్రుయెన్‌, డుప్లెసి (కెప్టెన్‌), బవుమా, డికాక్‌, ఫిలాండర్‌, కేశవ్‌ మహరాజ్‌, డేన్‌ పీట్‌, రబాడ, ఎన్‌గిడి.

పిచ్‌, వాతావరణం

ఈ మ్యాచ్‌కు మొత్తం ఐదు రోజులూ వర్షం ఆటంకపరిచే అవకాశం ఉంది. గత వారం రోజులుగా ఉదయం పూట వర్షం కురుస్తోంది. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఇక్కడ స్పిన్నర్లు 25 వికెట్లు తీశారు. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN