అంధత్వ నివారణే లక్ష్యం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-10 03:24:39

అమరావతి/అనంతపురం : ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కంటి సంబంధిత సమస్యలు ఉండరాదనే ఉద్దేశంతో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మూడేళ్లలో ఆరు దశలుగా కార్యక్రం కొనసాగుతుంది. తొలి దశలో భాగంగా ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు 70 లక్షల మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేస్తారు. వచ్చేనెల 1 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రెండో దశలో అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు. స్క్రీనింగ్, కళ్లజోళ్లు, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా ఉచిత వైద్య సేవలు అందిస్తారు. 3,4,5,6 దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షల నిర్వహించాలని లక్ష్యాలను నిర్దేశించింది. రాష్టవ్య్రాప్తంగా 4 కోట్ల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందుకోసం రూ 560.88 కోట్ల నిధులు కేటాయించింది. అనంతపురం జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రజలందరికీ కంటి పరీక్షల నుంచి శస్త్ర చికిత్సల వరకు ఉచితంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో చాలా మంది పౌష్టికాహార లోపం, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నట్లు పాదయాత్రలో గుర్తించిన జగన్ వాటి నివారణకు సత్వర
చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. ప్రతి మంగళవారం స్పందనపై సమీక్ష సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు ఎలా నిర్వహించాలనే విషయమై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో పాటు కలెక్టర్లతో సమీక్షలు జరిపారు. ఈ సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి కంటి వెలుగు కార్యక్రమానికి కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటి దశలో భాగంగా 70 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షలు జరుపుతారు. ఈనెల 16వ తేదీతో తొలిదశ పూర్తవుతుంది. కంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి వచ్చేనెల 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపుతారు. కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 160 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1737 మంది వైద్యాధికారులు పాఠశాలల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాలకు కంటి పరీక్షలకు సంబంధించిన కిట్లను ఇప్పటికే తరలించారు. 33వేల 204 మంది ఆశా వర్కర్లు, 11,408 మంది ఏఎన్‌ఎంలు, ప్రజారోగ్య సిబ్బందిని ఇందుకోసం నియమించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మొదటి దశలో వైద్యసేవలందించేందుకు నియమించిన సిబ్బందితో పాటు 64 వేల మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. 2020 ఫిబ్రవరి 1 నుంచి జూలై 31వరకు 3వ దశలో కోటి మందిని పరీక్షించి అవసరమైన మందులు, కళ్లద్దాలు అందజేస్తారు. 2020 ఆగస్టు 1 నుంచి 2021 జనవరి 31 వరకు కోటి మందికి, 2021 ఫిబ్రవరి నుంచి జూలై 31 వరకు కోటి మందికి, చివరి దశగా 2021 ఆగస్టు నుంచి 2022 జనవరి 31 వరకు మరో కోటి మందికి పరీక్షలు జరుపుతారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శుక్లాలు, గ్లకోమా, డయాబెటిక్, రెటినోపతి తదితర శస్తచ్రికిత్సలు ఉచితంగా నిర్వహిస్తారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN