అక్రమాలకు పాల్పడితే కాంట్రాక్టు రద్దు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-10 09:11:55

img

అనంతపురం, నవంబర్ 9: చిన్నారులు, వారి తల్లుల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం సరఫరా, పంపిణీలో అవకతవకలు చోటు చేసుకుంటే సహించేది లేదని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనత అన్నారు. సంబంధిత ఏజెన్సీలను రద్దు చేయడంతో పాటు ఆయా ప్రాంత అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం నగరంలోని రెవెన్యూ భవన్‌లో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 53 శాతం మంది పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారని, అందువల్ల అంగన్వాడీలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. అంగన్వాడీల ద్వారా శిశువుల, గర్భిణులు, బాలింతలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించి, మాతాశిశు మరణాలు, రక్తహీనత తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుకూ పౌష్ఠికాహారం అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల వారు నివసించే ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు అదనంగా పౌష్ఠికాహారం, గుడ్లు, సంపూర్ణ భోజనం అందిస్తామన్నారు. కదిరిలో ఇటీవల చోటుచేసుకున్న ఆకలి చావులను ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ సరుకుల సరఫరాలో అక్రమాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. గుడ్డు సైజు తక్కువగా ఉండటం, బాల సంజీవని ద్వారా సరఫరా అవుతున్న పౌష్ఠికాహారంలో నాణ్యత లోపించాయన్నారు. అలాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. గతంలో లాగా కాకుండా ఈ ప్రభుత్వ హయాంలో నాణ్యత గల పౌష్ఠికాహారం అందిస్తామన్నారు.
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని, తద్వారా మంచి ఆహారం అందేలా చూడాలని ఆదేశించారు. పేదరికం, నిరక్షరాస్యత మూలంగానే జోగినీ వ్యవస్థ, మహిళల అక్రమ రవాణా వంటివి కొనసాగుతున్నాయన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాంటి వాటిపై అవగాహన కల్పించి నిర్మూలనకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో విప్ కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
*చిత్రం... అనంతపురం నగరంలో విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి వనిత

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN