అడవుల రక్షణలో బీట్ అధికారులే కీలకం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-06 08:17:50

img

హైదరాబాద్, అక్టోబర్ 5: అడవుల రక్షణలో బీట్ అధికారులే కీలకమైన వారని ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫీసర్ (పీసీసీఎఫ్), అటవీ సిబ్బంది ప్రధాన అధికారి (హెచ్‌ఓఎఫ్‌ఎస్) అయిన ఆర్. శోభ పేర్కొన్నారు. అసిస్టెంట్ బీట్ ధికారుల నుండి బీట్ అధికారులుగా పదోన్నతి పొందిన వారికి ఆరునెలల పాటు దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన బీట్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ శనివారం జరిగింది. 2019 ఏప్రిల్ 15 న ప్రారంభమైన శిక్షణ శనివారం ముగిసింది. ఆరు నెలల పాటు శిక్షణ పొందిన బీట్ అధికారులు 38 మంది ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అధికారుల నుండి శోభ తొలుత గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, అడవుల రక్షణ బాధ్యత బీట్ అధికారులపైనే ఎక్కువగా ఉంటుందన్నారు. అడవులపెంపుదల, రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందన్నారు. అడవులపెంపకం కోసం హరితహారం పథకాన్ని చేపట్టినట్టు గుర్తు చేశారు. హరితహారం విజయవంతం చేసే బాధ్యత కూడా అటవి శాఖపైనే ఉందన్నారు. అటవీరక్షణ, అడవుల పెంపుదల, స్మగ్లింగ్ నిరోధించడం, వేట నియంత్రణ తదితర 15 అంశాలలో శిక్షణ ఇచ్చారు. వెపన్ ట్రైనింగ్, అటవీ భూములను సర్వే చేయడంలాంటి ప్రత్యేక శిక్షణ కూడా ఈ ఆరునెలల కాలంలో ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసిన బీట్ అధికారులకు నిర్వహించిన పరీక్షల్లో ఆసిఫాబాద్ డివిజన్‌కు చెందిన బి. సజన్‌లాల్ అత్యధిక మార్కులు సంపాదించి (824/950) ప్రథమస్థానం పొందారు. అలాగే ఏడు సబ్జెక్టుల్లో ప్రథమంగా నిలిచి ఆల్‌రౌండర్‌గా కూడా బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, పీసీసీఎఫ్ పి. రఘువీర్ మాట్లాడుతూ, అటవీ సంరక్షణలో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని క్షేత్రస్థాయి అటవీ సిబ్బందికి సూచించారు. శిక్షణ కోర్సు గురించి కోర్స్ డైరెక్టర్ ఎన్.ఆర్. సంగీత వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు అటవీ సంరక్షణ అధికారి స్వర్గం శ్రీనివాస్, ఫారెస్ట్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్, రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన 81 మంది ఫారెస్ట్ రేంజ్ అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...బీట్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌లో మాట్లాడుతున్న పీసీసీఎఫ్ శోభ

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN