అన్నదాత సుఖీభవ అవకతవకలపై విచారణ చేపడతాం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-09-30 05:09:34

మచిలీపట్నం : రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఆదివారం మంత్రి పేర్ని తన నివాసానికి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. బందరు మండలం పొట్లపాలెం, కొత్తపూడి గ్రామాలకు చెందిన పలువురు రైతులు మంత్రిని కలిసి అన్నదాత సుఖీభవ పథకంలోఅనర్హులైన వారి ఖాతాల్లో నగదు జమ చేశారని ఫిర్యాదు చేశారు. సూరత్ సుగుణ, సూరత్ రమేష్ బాబులకు సంబంధించిన ఎకరం భూమికి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.4వేలు నగదును వారి ఖాతాల్లో జమ కాకుండా నూకా నాగరాజు అనే రైతు ఖాతాకు జమ చేశారన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకంలో గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందన్నారు. వీటిపై పూర్తి దర్యాప్తుకు అధికారులను నియమించి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి లక్షా 30వేల ఉద్యోగాల కల్పన చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్ని అన్నారు. గ్రామ సచివాలయాలకు నియమితులైన అభ్యర్థులు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఎటువంటి వదంతులను నమ్మవద్దని, పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. సచివాలయ ఉద్యోగులుగా నియమితులైన వారు వారికి కావల్సిన ప్రాంతాల్లో, కోరుకున్న చోటే నియమించడం జరుగుతుందన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఆ శాఖలో ఒక సంవత్సర కాలానికి అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్న ఉద్యోగులను ప్రతిభ ఆధారంగానే తీసుకుంటున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD