అన్ని శాఖల సమన్వయంతో అమ్మవారి తెప్పోత్సవం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-07 10:17:28

విజయవాడ, అక్టోబర్ 6: దసరా ఉత్సవాల ముగింపు రోజైన విజయదశమి నాడు మంగళవారం సాయంత్రం పరమపావని కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల జలవిహారం జరగనుంది. ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవత శ్రీ కనకదుర్గాదేవికి కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన సేవ తెప్పొత్సవాన్ని కన్నులపండువగా తిలకించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జలవిహారాన్ని చూడముచ్చటైన వేడుకగా నిర్వహిస్తారు. తెప్పోత్సవంగా పిలిచే హంస వాహన సేవలో త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ గంగా పార్వతీ (దుర్గ) సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లను మూడుసార్లు ప్రదక్షిణలతో జలవిహారం చేయిస్తారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని దేవాదాయ, పోలీసు, ఇరిగేషన్, మున్సిపల్, తదితర శాఖల సమన్వయంతో దిగ్విజయంగా నిల్వహించాలని ఆదివారం రాత్రి మోడల్ గెస్ట్‌హౌస్‌లో తెప్పోత్సవం ఏర్పాట్లపై జరిగిన సమావేశం నిర్ణయించింది. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రధాన బోటుపై, అనుబంధ బోట్లపై ప్రయాణించే వారి సంఖ్యను బోటు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. ఎంతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే అంత మంచిదన్న విషయాన్ని మరువరాదన్నారు. నిర్దిష్ట సంఖ్య కంటే ఎంత తక్కువగా బోటులోకి అనుమతిస్తే అంత మంచిదన్నారు. పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ తెప్పొత్సవ రథంపై ప్రయాణించే వారి వివరాలను ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రకాశం బ్యారేజీ, ఇతర ఘాట్లపై రద్దీని నివారించేలా చూడాలన్నారు. దీనికి పాస్‌లు సిద్ధం చేయాలన్నారు. ఇండియన్ రిజిస్టర్ షిప్పింగ్ సంస్థ ఆధీకృత అధికారి, మెరైన్ పోర్ట్ ట్రస్ట్ సర్వేయర్లు, నిపుణుల సూచనలను ముందుగా తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, డీసీపీ విజయరావు, దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు, సబ్ కలెక్టర్ చక్రపాణి, జేసీ-2 మెహెర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD