అభిమానికి వార్నర్ బహుమతి.. ఆశ్చర్యపోయిన బాలుడు (వీడియో)!!

mykhel

mykhel

Author 2019-10-29 16:24:47

img

అడిలైడ్‌: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, విధ్వంసక ఆటగాడు డేవిడ్‌ వార్నర్ చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వార్నర్‌ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ (100; 56 బంతుల్లో 10x4,4x6) చేసాడు. ఈ సెంచరీని వార్నర్ తన బర్త్‌డేకి తనే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆసీస్‌ జట్టు టీ20ల్లోనే అత్యుత్తమ విజయం సాధించింది.

అభిమానికి వార్నర్ బహుమతి:

తొలి టీ20 మ్యాచ్‌కు ముందు వార్నర్‌ ఓ అభిమానిని ఆశ్చర్యపర్చాడు. స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసి తిరిగి డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తున్న సమయంలో అక్కడ సందడి చేస్తున్న ఓ బాలుడికి వార్నర్ తన గ్లోవ్స్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ బాలుడి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వార్నర్‌ ఇచ్చిన గ్లోవ్స్‌ను చూసుకుంటూ సంతోషపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్‌.కామ్‌ వెబ్‌సైట్‌ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

img

ప్రపంచకప్‌లోనూ బహుమతి ఇచ్చాడు:

వార్నర్‌ ఇలా అభిమానులకు బహుమతి ఇవ్వడం తొలిసారి ఏమీ కాదు. గత వన్డే ప్రపంచకప్‌లోనూ ఓ చిన్నారికి బహుమతి ఇచ్చి ఆశ్చర్యపర్చాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన వార్నర్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు' దక్కింది. తనకు లభించిన ఆ అవార్డును మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారికి బహుమతిగా ఇచ్చేశాడు. అనుకోకుండా తనకు అందిన వార్నర్ బహుమతిని చూసి చిన్నారి ఎంతో సంతోషించాడు.

img

మూడు ఫార్మాట్లలో సెంచరీలు:

తొలి టీ20లో డేవిడ్‌ వార్నర్‌ సెంచరీ చేయడంతో.. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. వార్నర్‌ కన్నా ముందు మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ మాత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసారు. అంతేకాదు టీ20లలో వార్నర్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఆసీస్ మాజీ విధ్వంసక ఆటగాళ్ళు హేడెన్, గిల్ క్రిస్ట్ లాంటి ఆటగాళ్లు కూడా టీ20లో సెంచరీ చేయలేదు. వారికి సాధ్యం కానీ రికార్డులను ఈ ముగ్గురు అందుకున్నారు.

img

నిషేధం తర్వాత తొలి టీ20 మ్యాచ్:

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో వార్నర్‌ ఏడాది కాలం పాటు ఆసీస్ జ‌ట్టుకు దూరం అయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధం ముగిసిన త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఐపీఎల్‌ 12వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే 2019 యాషెస్‌ సిరీస్‌లో పరుగులు చేయడంలో మాత్రం ఇబ్బందిపడ్డారు. హెడింగ్లీ వేదికగా జరిగిన మూడో టెస్టులో 61 పరుగులు తప్ప మిగతా అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి కేవలం 31 పరుగులే చేశాడు. మూడు సార్లు డకౌట్ అయ్యాడు. పొట్టి ఫార్మాట్‌ మాత్రం దుమ్మురేపాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉన్న విషయం తెలిసిందే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN