ఆఖరి పంచ్‌ మనదేనా?

Nava Telangana

Nava Telangana

Author 2019-11-10 05:33:30

- జామ్తాలో భారత్‌, బంగ్లా సిరీస్‌ వేట
- ఆత్మవిశ్వాసంతో జోరుమీదున్న ఆతిథ్య జట్టు
- మరో సంచలన విజయంపై బంగ్లా గురి
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-నాగ్‌పూర్‌
పొట్టి పోరు అంతిమ ఘట్టానికి చేరుకుంది. తొలి పంచ్‌ బంగ్లాదేశ్‌ విసరగా, మలి పంచ్‌ భారత్‌ వంతైంది. టీ20 సిరీస్‌ దక్కించుకోవాలనే తపనలో భారత్‌, బంగ్లాదేశ్‌ నాగ్‌పూర్‌కు చేరుకున్నాయి. పొట్టి సిరీస్‌ ఊరిస్తోన్న వేళ ఆఖరి పంచ్‌ ఎవరిది కానుంది? ఆసక్తికరంగా మారింది. రాజ్‌కోట్‌లో భారత్‌ తిరుగులేని ప్రదర్శన చేసినా.. బంగ్లాదేశ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అన్ని రంగాల్లోనూ బంగ్లాదేశ్‌ సైతం భారత్‌కు గట్టి సవాల్‌ విసరగల స్థితిలో కనిపిస్తోంది. మరోవైపు సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తోన్న రోహిత్‌ శర్మ తన నాయకత్వంలో భారత్‌కు మరో సిరీస్‌ అందించాలని చూస్తున్నాడు. పరుగుల వరద పారేలా సిద్ధం చేసిన జామ్తా పిచ్‌పై నేడు భారత్‌, బంగ్లాదేశ్‌ మూడో టీ20లో తలపడనున్నాయి.
పుంజుకున్న టీమ్‌ ఇండియా : తొలి మ్యాచ్‌ పరాజయం అనంతరం భారత శిబిరంలో ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. కానీ రాజ్‌కోట్‌ విజయంతో టీమ్‌ ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లోకి మళ్లీ ఆత్మవిశ్వాసం వచ్చేసింది. బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగానే ఉన్నప్పటికీ బౌలింగ్‌ విభాగం ఆతిథ్య జట్టుకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుత బౌలర్లలో యుజ్వెంద్ర చాహల్‌ మినహా మరొకరు 2020 టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లేదు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌ బౌలర్ల వైఫల్యాన్ని ఓ ప్రయోగంగానే చూస్తోంది. దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌ పేస్‌తో నిరాశపరిచారు. శివం దూబె ఆశించిన స్థాయిలో బంతిని సంధించటం లేదు. వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌లు స్పిన్‌తో ఫర్వాలేదనించారు. రోహిత్‌ శర్మ ధనాధన్‌ పునరాగమనంతో బ్యాటింగ్‌ లైనప్‌కు కొత్త జోష్‌ వచ్చింది. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పరుగులు సాధిస్తున్నా, దూకుడు కోల్పోయాడు. నాగ్‌పూర్‌లో రోహిత్‌తో కలిసి ధావన్‌ దూకుడు పట్టాలు ఎక్కుతాడేమో చూడాలి. మూడో స్థానంలో కెఎల్‌ రాహుల్‌ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. అచ్చొచ్చిన ఫార్మాట్‌లో రాహుల్‌ తడాఖా చూపించాలని ఎదురుచూస్తున్నాడు. శ్రేయాష్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ సిరీస్‌లో తమదైన ముద్ర చూపించాల్సి ఉంది. ఆల్‌రౌండర్లు కృనాల్‌ పాండ్య, శివం దూబెలో తుది జట్టులో తమ స్థానాలకు న్యాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ భీకర ఫామ్‌లోకి రావటంతో నాగ్‌పూర్‌ టీ20లో టీమ్‌ ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
మరో సంచలనం కోసం..! : కీలక ఆటగాళ్లు షకిబ్‌ అల్‌ హసన్‌, తమీమ్‌ ఇక్బాల్‌, మెష్రఫె మొర్తాజాలు లేకుండానే భారత్‌ను టీ20ల్లో తొలిసారి ఓడించి బంగ్లాదేశ్‌ ఎనలేని ఆత్మవిశ్వాసం సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌ లైనప్‌లో బంగ్లాదేశ్‌ ఇప్పటికీ మెరుగైన జట్టుగానే కనిపిస్తోంది. లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ నయీం సహా కెప్టెన్‌ మహ్మదుల్లా, ముష్ఫీకర్‌ రహీమ్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. రాజ్‌కోట్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ మెరిసినా.. ఆఖరు ఓవర్లలో వేగంగా పరుగులు చేయటంలో బంగ్లా విఫలమైంది. దీంతో ఆశించిన స్కోరు కంటే చాలా తక్కువ మొత్తానికే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సిరీస్‌ వేటలో నిలిచిన సమయాన ముష్ఫీకర్‌, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్‌ల నుంచి బంగ్లాదేశ్‌ భారీ ప్రదర్శన ఆశిస్తోంది. ఈ ముగ్గురు రాణిస్తే బంగ్లాదేశ్‌ మంచి స్కోరు చేయగలదు. బౌలింగ్‌ విభాగంలో నాయకుడు ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ తడబడుతున్నాడు. రాజ్‌కోట్‌లో రోహిత్‌ శర్మ ఊచకోతకు బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ దశం బెంబేలెత్తింది. ఆమినుల్‌ ఇస్లాం, అరాఫత్‌ సన్నీ, షఫిల్‌ ఇస్లాంలు కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. న్యూఢిల్లీలో భారత్‌కు తొలి షాకిచ్చిన బంగ్లాదేశ్‌, నాగ్‌పూర్‌లో మరో షాక్‌ టీ20 సిరీస్‌ సాధించాలని భావిస్తోంది.
పిచ్‌ రిపోర్టు : నాగ్‌పూర్‌ జామ్తా పిచ్‌ సహజసిద్ధమైన బ్యాటింగ్‌ వికెట్‌. కానీ ఇక్కడ జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ధోనీసేన న్యూజిలాండ్‌ చేతిలో కంగుతిన్నది. ఆ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించిన కివీస్‌ భారత్‌ను 89 పరుగులకే కుప్పకూల్చింది. ఆ వరల్డ్‌కప్‌లోనే బంగ్లాదేశ్‌ క్వార్టర్‌ఫైనల్స్‌ ఉత్కంఠలో భారత్‌కు ఓటమి భయాన్ని కలిగించింది. జామ్తా ఇప్పుడు స్పిన్‌ను అనుకూలమైనా, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరుగుల వరదే ఎక్కువ అవకాశం. తొలి రెండు మ్యాచులకు వాతావరణం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నా, సజావుగా సాగాయి. నాగ్‌పూర్‌లో నేడు వాతావారణం ఆహ్లాదకరంగా ఉండనుంది. ఉష్ణోగ్రతలు సైతం సాధారణంగా ఉండనున్నాయి.
తుది జట్లు (అంచనా) : భారత్‌ : రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌, శ్రేయాష్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, శివం దూబె, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వెంద్ర చాహల్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌.
బంగ్లాదేశ్‌ : లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ నయీం, ముష్ఫీకర్‌ రహీమ్‌, మహ్మదుల్లా, మొసద్దెక్‌ హుస్సేన్‌, అఫిఫ్‌ హుస్సేన్‌, ఆమినుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, అరాఫత్‌ సన్నీ, షఫిల్‌ ఇస్లాం.
ప్రతి రోజు, ప్రతి నిమిషం రిషబ్‌ పంత్‌ గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు. అతడు ఏం చేయాలనుకుంటున్నాడో తొలుత అది చేయనివ్వండి. మీ కండ్లను కొంత కాలం రిషబ్‌ పంత్‌కు దూరంగా ఉంచాలని అందరినీ కోరుతున్నాను. పంత్‌ భయమెరుగని క్రికెటర్‌. జట్టు మేనేజ్‌మెంట్‌ పంత్‌కు ఆ స్వేచ్ఛ కొనసాగించాలని అనుకుంటోంది. మీ చూపులను పంత్‌కు దూరంగా ఉంచితే, అతడు మెరుగైన ప్రదర్శన చేయగలడు. పంత్‌కు ఇంకా 22 ఏండ్లే. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటాలని ఎదురు చూస్తున్నాడు. మైదానంలో అతడు చేసే ప్రతి చిన్న పనిపైనా చర్చ పద్దతి కాదు' - రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN