ఆర్టీసీ విలీనంపై మరో అడుగు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-25 02:56:49

img

విజయవాడ, అక్టోబర్ 24: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. విలీనానికి సంబంధించి విధివిధానాలను సూక్ష్మంగా పరిశీలించేందుకు వీలుగా తాజాగా వర్కింగ్ గ్రూపును గురువారం ఏర్పాటు చేసింది. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వంలో ప్రజా రవాణా శాఖ ఏర్పాటుకు వీలుగా రవాణా శాఖ ప్రిన్సిపల్ కారదర్శి అధ్యక్షతన ఆరుగురు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఈ నెల 11న నియమించింది. నవంబర్ 30లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించిన నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో ఉన్నతాధికారుల కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ కమిటీ అధికారులకు, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇవ్వాల్సిన హోదా, వేతనాల్లో వ్యత్యాసాలు, సర్వీసు నిబంధనలు తదితర అంశాలను చర్చించింది. ఆర్టీసీ ఎండీని ప్రజా రవాణా శాఖ డైరెక్టర్ జనరల్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా, రీజినల్ మేనేజర్లను జాయింట్ డైరెక్టర్లుగా, డిపో మేనేజర్లను అసిస్టెంట్ మేనేజర్లుగా మార్చేందుకు ప్రతిపాదించారు. క్లరికల్ సిబ్బందికి సంబంధించి ఇబ్బంది అంతగా లేనప్పటికీ, సూపర్‌వైజర్‌లు, కండక్టర్లు, డ్రైవర్ల హోదా, వేతనాల తదితర అంశాల్లో న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా తీసుకునే చర్యలపై చర్చించారు. అయితే మరింత సూక్ష్మంగా అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. ప్రజా రవాణా శాఖ రూపకల్పన, వివిధ పోస్టులు ఏర్పాటు, హోదాల నిర్ణయం, వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు వేతన స్కేళ్లు, సర్వీసు నిబంధనలు తదితర అంశాలపై సిఫారసులతో నవంబర్ 15లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఏడుగురు సభ్యులు ఉన్న ఈ గ్రూపులో ఆర్థిక, సాధారణ పరిపాలన, న్యాయ, రవాణా, ఆర్టీసీ తదితర శాఖల ఉన్నతాధికారులను సభ్యులుగా నియమించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD