ఇక రాష్ట్రంలో.. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-23 07:52:36

img

కరీంనగర్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులైన విద్యావంతులందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టిందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అందిపుచ్చుకొని, తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం స్థానిక రెవెన్యూ గార్డెన్స్‌లో నగర పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు నిర్వహించిన జాబ్‌మేళాలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగులైన విద్యావంతులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 6,200 మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరయ్యారన్నారు. సుమారు 28 పెద్ద కంపెనీలు తమ తమ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ మేళాకు రావడం హర్షణీయమన్నారు. ప్రైవేటు కంపెనీలు నిరుత్సాహపడకుండా తమ సమర్థతను నిరూపించుకుంటూ ఉద్యోగాలు పొంది ఉన్నతంగా ఎదగాలని కోరారు. కరీంనగర్‌లో ఐటీ టవర్ ప్రారంభం అవుతుందని, ఇది ఆరంభం కాగానే అనేకమంది నిరుద్యోగులైన విద్యావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. ఆయా కంపెనీల్లో నిరుద్యోగులకు అందించే ఉద్యోగ వివరాలు కంపెనీ ప్రతినిధుల నుంచి అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ వరకు చదివిన యువతీ, యువకుల విద్యార్హతను బట్టి ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు, ఇందుకోసం టాలెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రతినిధులు మంత్రి గంగుల కమలాకర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, నగర పాలక కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, మెప్మా పీడీ పవన్ కుమార్, శ్రీవాణి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
*చిత్రం... నిరుద్యోగులను ఇంటర్వ్యూ చేస్తున్న మంత్రి కమలాకర్

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD