ఈడెన్‌లో డే-నైట్‌ టెస్ట్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-30 12:42:00

img

* 'గులాబీ'తో ఆడేందుకు బంగ్లాదేశ్‌ అంగీకారం
* బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ
కోల్‌కతా : భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక జరిగే రెండోటెస్ట్‌ గులాబీ బంతితో డే-నైట్‌లో జరగనుంది. డే-నైట్‌ టెస్ట్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు(బిసిబి) అంగీకరించడంతో నవంబర్‌ 22-26వరకు టీమిండియా తొలి డే-నైట్‌ టెస్ట్‌కు బంగ్లాతో తలపడుతుందని బిసిసిఐ అధ్యక్షులు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు.
డే-నైట్‌ టెస్ట్‌ గురించి గంగూలీ బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డుకు ప్రతిపాదించిన కొద్ది సమయంలోనే చారిత్రక టెస్ట్‌కు మార్గం సుగమం కావడం గమనార్హం. తొలుత బంగ్లా క్రికెటర్లు గులాబీ బంతి మ్యాచ్‌ను వ్యతిరేకించినా బిసిబి వారితో నాలుగైదుసార్లు సమావేశమై ఒప్పించింది. 'ఇదొక శుభ పరిణామం... టెస్ట్‌ క్రికెట్‌కు ఈ చర్యలు అవసరం. నేను, నా జట్టు దీనికి కట్టుబడి ఉన్నాం. విరాట్‌కు కృతజ్ఞతలు. అతడు డే-నైట్‌ టెస్ట్‌కు అంగీకరించాడు' అని గంగూలీ మీడియాకు తెలిపారు. ఈ డే-నైట్‌ టెస్ట్‌ జరిగే ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో క్రీడా దిగ్గజాలు అభినవ్‌ బింద్రా, మేరీకోమ్‌, పివి సింధులకు సన్మానం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక గులాబీ టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ తరహాలోనే ఈడెన్‌ గార్డెన్‌లోనూ టీమిండియా గులాబీ బంతితో వార్షిక టెస్ట్‌ ఆడనుంది. దులీప్‌ ట్రోఫీలో గులాబీ బంతితో ఆడిన క్రికెటర్లు బంతి పాతబడిన తర్వాత సరిగ్గా కనిపించడం లేదని అప్పట్లో బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పుడూ వాడే ఎస్‌జి టెస్ట్‌ క్రికెట్‌ బంతులను కాకుండా కుకాబుర్రా, డ్యూక్స్‌ బంతులను వినియోగించే అవకాశముంది.

టీమిండియా కెప్టెన్‌కు ఉగ్రముప్పు?
బంగ్లాదేశ్‌తో నవంబర్‌3న ఢిల్లీలో జరిగే తొలి టీ20లో ఆడే టీమిండియా ఆటగాళ్లకు భద్రత పెంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు అందాయట. అలాగే సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కూడా ఉగ్ర ముప్పు ఉందని పోలీసులు తెలిపారు. కేరళలోని కోళికోడ్‌ కేంద్రంగా పనిచేస్తున్న అఖిలభారత లష్కర్‌ ఉగ్రవాద సంస్థ(ఎన్‌ఐఏ) పేరుతో బిసిసిఐకి ఒక ఉత్తరం పంపించిందని సమాచారం. టీమిండియా ఆటగాళ్లతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, హోమంత్రి అమిత్‌షా, బిజెపి సీనియర్‌ నేత అద్వానీ, కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ పేర్లు ఆ లేఖలో ఉన్నాయట. ఈ ఉత్తరం నకిలీదేనని భావిస్తున్నప్పటికీ ఆటగాళ్ల భద్రతే పరమావధి కాబట్టి వారికి గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. నవంబర్‌ 3 నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య అరుణ్‌జైట్లీ మైదానంలో తొలి టీ20 జరగనున్న విషయం తెలిసిందే. మిగతా రెండు టీ20లు రాజ్‌కోట్‌,నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్నాయి. టెస్ట్‌ సిరీస్‌కు ఇండోర్‌, కోల్‌కతా ఆతిథ్యమిస్తున్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD