ఈడెన్‌లో తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్!
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది. దీంతో భారత టెస్ట్ క్రికెట్లో సరికొత్త ఇన్నింగ్స్ మొదలవబోతోంది. నిజానికి ఈ డేనైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఎప్పుడో ఆడేశాయి. అయితే.. టెస్టుల్లో నంబర్ వన్ జట్టు భారత్ మాత్రం ఇప్పటి వరకూ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐదు రోజుల మ్యాచ్ మాత్రం ఆడలేదు. నవంబర్ 22న బంగ్లాదేశ్ జట్టుతో జరిగే తొలి డేనైట్ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక కానుంది. భారత గడ్డపై విరాట్ సైన్యం గులాబీ బంతితో ఆడే డే నైట్ టెస్ట్ మ్యాచ్‌ను మనం చూడొచ్చు. ఇదంతా బీసీసీఐ కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంకల్పం వల్ల సాకారం అవుతోంది. డేనైట్ టెస్ట్ మ్యాచ్ ఆలోచనను తొలుత బంగ్లా ఆటగాళ్ళు వ్యతిరేకించారు. అయితే.. పలు సమావేశాల తరువాత బంగ్లా క్రికెట్ బోర్డును సౌరవ్ ఒప్పించాడు. తరువాత తమ ఆటగాళ్ళను బీసీబీ కూడా సమ్మతింప చేసింది.
బీసీసీఐ అధ్యక్ష పదవిలో సౌరవ్ గంగూలీ కేవలం తొమ్మిది మాసాలే ఉంటాడు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే టీమిండియా కెప్టెన్ కోహ్లీని ‘పింక్‌బాల్ క్రికెట్’కు ఒప్పించడంతో తన పట్టుదల ఎలాంటిదో చేతల ద్వారా చెప్పకనే చెప్పాడు. ఆ వెంటే బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)తో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాడు. ప్రపంచంలోనే ధనవంతమైన క్రికెట్ బోర్డు కోరితే ఎవరు మాత్రం కాదంటారు? అందుకే బీసీబీ కూడా సై అంది.భారత క్రికెట్లో ఈడెన్ గార్డెన్స్‌కు విశేష చరిత్ర ఉంది. ఈ చరిత్రలో ఇప్పుడు పేజీ పింక్‌బాల్ పేజీ కూడా జత అవబోతోంది. నవంబర్ 22 నుంచి 26 వరకూ భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌బాల్‌తో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ‘బీసీబీ పింక్‌బాల్ టెస్టుకు అంగీకరించింది. ఇది సానుకూల పరిణామం. టెస్టు క్రికెట్‌కు అవసరమైన మార్పు ఇది. నేను, నా బృందం ఇలాంటి ఆట కోసం పరితపించాం. కొత్త తరహా టెస్టుకు సై అన్న కెప్టెన్ కోహ్లీకి కూడా థ్యాంక్స్’ అని గంగూలీ అన్నాడు.
నిజానికి చాన్నాళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్లో పింక్‌బాల్ క్రికెట్ ఆడించాలని అప్పటి క్రికెట్ కమిటీ చైర్మన్ గంగూలీ సిఫార్సు చేశాడు. అతని ప్రతిపాదన వల్లే దులీప్ ట్రోఫీలో వరుసగా 2016–17, 2017–18, 2018–19 మూడు సీజన్లు డేనైట్ ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించారు. కానీ ఈ సీజన్లో మళ్లీ పాత పద్ధతినే అవలంబించి ఎర్రబంతితో మ్యాచ్‌లు నిర్వహించారు. కోల్‌కతా డేనైట్ టెస్టు మ్యాచ్‌లో ఆట మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మొదలవుతుందని, 68 వేల సామర్థ్యం ఉన్న స్టేడియంలో టికెట్ల ధరను కనిష్టంగా రూ. 50 నుంచి విక్రయిస్తామని ‘క్యాబ్’ సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపాడు.
డేనైట్ టెస్ట్ ముచ్చట ఈనాటిది కాదు. నాలుగేళ్ల క్రితమే 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య పింక్‌బాల్ మ్యాచ్ జరిగింది. కానీ ఈ నాలుగేళ్లలో కేవలం 11 మ్యాచ్‌లే జరగడం గమనార్హం. అయితే.. అన్నింట్లోనూ ఫలితాలు వచ్చాయి.