ఈ గాయాలు వేరయా!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-20 01:46:25

img

ఆధునిక క్రికెట్‌లో ఆటగాళ్లు గాయాల బారిన పడడం అత్యంత సహజం.. కానీ ఓ క్రికెటర్‌ గాయానికి గురయ్యాడంటే అది బ్యాటింగ్‌.. ఫీల్డింగ్‌.. లేదా బౌలింగ్‌లోనో అయ్యుంటుంది.

కానీ తమంతట తాము ఏరికోరి గాయాల పాలవ్వడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఈ మధ్య ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ మార్ష్‌ తమ డ్రెస్సింగ్‌ రూమ్‌ గోడకు, దక్షిణాఫ్రికా ఓపెనర్‌ మార్‌క్రమ్‌ ఓ ధృడమైన వస్తువుకు పంచ్‌ ఇచ్చి మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. తమ ఆటతీరు నచ్చక క్షణికావేశంలో వారు చేసిన పనది. అయితే ప్రపంచ క్రికెట్‌లో ‘అధికారిక’ గాయాలు కాకుండా ఇలా ఎవరూ ఊహించని ‘వింత’ గాయాలకు గురైన ఉదంతాలు మరికొన్ని ఉన్నాయి. అవి ఎప్పుడు.. ఎలా జరిగాయో ఓ లుక్కేద్దాం..

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

బెన్‌ స్టోక్స్‌

ఇంగ్లండ్‌కు వన్డే వరల్డ్‌కప్‌ను అందించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా గతంలో మిషెల్‌ మార్ష్‌, మార్‌క్రమ్‌ తరహాలోనే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 2014లో ఇంగ్లండ్‌ టీమ్‌ కరీబియన్‌ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్‌లో స్టోక్స్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అంతేకాకుండా ఓ టీ20 మ్యాచ్‌లో డకౌటయ్యాడు. దీంతో తన అసహనాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలీక డ్రెస్సింగ్‌ రూమ్‌లోని లాకర్‌పై చూపాడు. ఫలితంగా చేతికి గాయం కావడంతో పాటు అదే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌కే దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జార్జి గార్టన్‌

నిరుడు ఇంగ్లండ్‌ జట్టు కరీబియన్‌ పర్యటనకు వెళ్లాల్సిఉంది. అయితే, అప్పటికే ఆలస్యమై జట్టుతో కలిసేందుకు తగినంత సమయం లేకపోవడంతో లాస్‌ఏంజిల్స్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కనెక్టింగ్‌ ఫ్లయిట్‌ను అందుకునేందుకు ఇంగ్లండ్‌ లెఫ్టామ్‌ పేసర్‌ జార్జి గార్టన్‌ ఉరుకులు పరుగుల మీద రావాల్సి వచ్చింది. ఈ హడావిడిలో... లగేజీ బెల్ట్‌పై ఉన్న తన 30 కేజీల బ్యాగ్‌ను ఒక్కసారిగా లాగాడు. దీంతో తన పక్కటెముకల వద్ద విపరీతమైన నొప్పి ఏర్పడింది. ఈ కారణంగా ఆ సిరీ్‌సతో పాటు ఆ తర్వాత సీజన్‌లో చాలా మ్యాచ్‌లకు తను దూరంగా ఉండాల్సి వచ్చింది.

జిమ్మీ ఆడమ్స్‌

1998-99లో వెస్టిండీస్‌ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అయితే తమ వేతనాల చెల్లింపు విషయంలో అసంతృప్తితో ఉన్న విండీస్‌ జట్టు ఆ టూర్‌కు వెళ్లేది లేదని లండన్‌లోనే ఆగిపోయింది. కానీ చివరి నిమిషంలో ఒప్పందం కుదిరి ఆటగాళ్లంతా జొహాన్నెస్‌బర్గ్‌ బయలుదేరారు. విమాన ప్రయాణంలో బ్రెడ్‌ రోల్‌ను కట్‌ చేస్తున్న సందర్భంగా జిమ్మీ ఆడమ్స్‌ ఎడమచేతి చిటికెన వేలుకు గాయమైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌కు అతడు దూరం కావడంతో పాటు విండీస్‌ వైట్‌వాష్‌కు గురైంది.

జేసన్‌ రాయ్‌

గతేడాది జరిగిన టీ20 బ్లాస్ట్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తన బ్యాట్‌ ఇచ్చిన రిటర్న్‌ పంచ్‌కు గాయపడి ఓ మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చింది. సర్రేకు ఆడే రాయ్‌ హాంప్‌షైర్‌తో మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. దీంతో కోపంతో తన చేతిలో ఉన్న బ్యాట్‌ను కిందికి బలంగా విసిరాడు. అయితే అది తిరిగి పైకి వచ్చి అతడి ముఖాన్ని తాకడంతో గాయపడ్డాడు. తన ప్రవర్తనకు రాయ్‌ అప్పట్లో క్షమాపణలు కూడా చెప్పాడు.

క్వింటన్‌ డికాక్‌

దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డికాక్‌ తన శునకాల కారణంగా గాయపడాల్సి వచ్చింది. 2015-16లో ఇంగ్లండ్‌తో జొహాన్నెస్‌బర్గ్‌లో మూడో టెస్టు ఆడాల్సి ఉంది. అయితే డికాక్‌ తన శునకాలతో అలా మార్నింగ్‌ వాక్‌కు వెళ్లగా అక్కడ కాలుజారి కిందపడడంతో మోకాలికి గాయమైంది. ఈ కారణంగా అతడు ఆ టెస్టుకు దూరం కావడంతో ఆఘ మేఘాలపై మరో దేశంలో ఉన్న డేన్‌ విలాస్‌ను పిలిపించగా... అతడు మ్యాచ్‌ ప్రారంభమైన గంట తర్వాత వచ్చాడు.

టె ర్రీ ఆల్డర్‌మన్‌

తనకు అవసరం లేని పనిచేసి తీవ్ర గాయానికి గురైన పరిస్థితి ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ టెర్రీ ఆల్డర్‌మన్‌ది. 1982-83 యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా పెర్త్‌లో తొలి టెస్టు జరిగింది. ఆ రోజుల్లో అభిమానులు పిచ్‌పైకి దూసుకురావడం చాలా సహజంగా జరుగుతుండేది. ఇంగ్లండ్‌ 400 పరుగులు చేయగానే ఆ జట్టు ఫ్యాన్స్‌ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చారు. ఇందులో 19 ఏళ్ల టీనేజర్‌ ఒకడు ఆల్డర్‌మన్‌ తల వెనక భాగంలో గట్టిగా కొట్టి పెవిలియన్‌ వైపు పరిగెత్తాడు. అక్కడ పోలీసులెవరూ లేకపోవడంతో అతడిని పట్టుకునేందుకు ఆల్డర్‌మన్‌ సిద్ధమయ్యాడు. దీంట్లో భాగంగా తనకు 20 గజాల దూరంలోనే ఉన్న అభిమానిని పట్టేందుకు రగ్బీ తరహాలో అతడిపై దూకాడు. కానీ కిందపడే సమయంలో ఆల్డర్‌మన్‌ కుడి భుజం ఎముక స్థానభ్రంశమైంది. ఈ గాయంతో అతడు ఏకంగా ఏడాదిపాటు క్రికెట్‌కు దూరం కావాల్సి వచ్చింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD