ఎలక్ట్రానిక్ వ్యర్థాల పట్ల జాగ్రత్త!

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-09-26 01:04:33

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: గంగానది ఉపనది అయిన మొరాదాబాద్‌లోని రామ్‌గంగా నది తీరంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అక్రమంగా పారవేయకుండా, ధ్వంసం చేయకుండా చూడాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘హజార్డస్ అండ్ అదర్ వేస్టెస్ (మేనేజ్‌మెంట్ అండ్ ట్రాన్స్‌బౌండరి మూవ్‌మెంట్) రూల్స్, 2016కు అనుగుణంగానే ఎలక్ట్రానిక్ వ్యర్థాల ధ్వంసం లేదా రీసైక్లింగ్ జరగాలని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ‘నిర్వహణ, నిల్వ, విసర్జన సౌకర్యాలు (టీఎస్‌డీఎఫ్) కూడా నియమాలకు అనుగుణంగా ఉండి తీరాలి. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఇతర ప్రమాదకరమయిన వ్యర్థాలను నిర్వహించేవారు, పునరుపయోగించేవారు నియమాలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సంబంధిత సంస్థలకు జారీ చేసిన మార్గదర్శకాలు, వాటి ప్రకారం తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని ధర్మాసనం సూచించింది. ఇదిలా ఉండగా, ఒక కార్యాచరణ ప్రణాళికను రెండు దశలలో అమలు చేయడం జరుగుతుందని పేర్కొంటూ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక నివేదికను ఈ విచారణ సందర్భంగా ఎన్‌జీటీకి సమర్పించారు. ‘మొదటి దశలో తాత్కాలిక నిల్వ సౌకర్యాలు ఉంటాయి. రెండో దశలో శాశ్వత నిల్వ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది’ అని అందులో పేర్కొన్నారు. అమ్‌రోహలోని టీఎస్‌డీఎఫ్‌లో తాత్కాలిక నిల్వ సౌకర్యాలు తప్పనిసరిగా ఉంటాయని, శాశ్వత నిల్వ కేంద్రాల ఏర్పాటుకు అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని విచారణ సందర్భంగా సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ మొత్తం ప్రక్రియ మూడు నెలల్లోగా పూర్తి కావాలని ఎన్‌జీటీ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN