ఎవరికీ అందనంత ఎత్తులో…

Mana Telangana

Mana Telangana

Author 2019-10-25 05:15:12

img

మన తెలంగాణ/క్రీడా విభాగం: అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్తగా నిర్వహిస్తున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ప్రత్యర్థి జట్లకు అందనంత ఎత్తులో నిలిచింది. ఐసిసి టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడింది. అయితే ఆడిన అన్ని మ్యాచుల్లో కూడా విరాట్ కోహ్లి సేన జయకేతనం ఎగుర వేసింది. భారత్ ఈ టోర్నీలో తొలి సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ గడ్డపై జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 20తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత్ ఖాతాలోకి ఏకంగా 120 పాయింట్లు చేరాయి. ఇక, సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా భారత్ వైట్ వాష్ చేసింది. ఏకపక్షంగా సాగిన సిరీస్‌లో టీమిండియా 30తో జయభేరి మోగించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో మరో 120 పాయింట్లు జమ అయ్యాయి. ఆడిన ఐదు మ్యాచ్‌ల ద్వారా 240 పాయింట్లు సొంతం చేసుకున్న టీమిండియా ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. రెండో, మూడో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్, శ్రీలంకలు కేవలం 60 పాయింట్లను మాత్రమే సాధించాయి. దీన్ని బట్టి భారత్ ఎంత సురక్షిత స్థానంలో ఉందో ఊహించుకోవచ్చు.
సమష్టి పోరాటం వల్లే..
ఇక, విజయాల్లో సమష్టితత్వం స్పష్టంగా కనిపిస్తోంది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ సమష్టిగా పోరాడింది. ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించడంతో భారత్‌కు ఎదురే లేకుండా పోయింది. ఒక్క తొలి టెస్టులో తప్ప సౌతాఫ్రికా మిగతా మ్యాచుల్లో టీమిండియాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ అసాధారణంగా రాణించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టును ముందుండి నడిపించాడు. ఇక, ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లను ఎంత పొగిడినా తక్కువే. సిరీస్‌లో వీరిద్దరూ పరుగుల వరద పారించారు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో భారత్ ప్రతి మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు సాధించింది. తొలి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా అద్భుతంగా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించి సత్తా చాటాడు. ఇక, రెండో టెస్టులో రోహిత్ విఫలమైనా మయాంక్ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి అజేయ డబుల్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అజింక్య రహానె, పుజారా, జడేజాలు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్‌కు ఎదురే లేకుండా పోయింది. పుణెలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక, రాంచీలో జరిగిన మ్యాచ్‌లో మయాంక్, కోహ్లి, పుజారాలు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. అయితే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కళ్లు చెదిరే డబుల్ సెంచరీతో జట్టుకు అండగా ఉన్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ పరుగుల వరద పారించాడు. రహానె కూడా సెంచరీతో తనవంతు పాత్ర పోషించాడు. జడేజా కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. మరోవైపు బౌలర్లు కూడా తమవంతు సహకారం అందించారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు మరోసారి చెలరేగి పోయారు. అశ్విన్ 15 వికెట్లతో తనకు ఎదురులేదని చాటాడు. జడేజా కూడా 11 వికెట్లతో సత్తా చాటాడు. ఇక, ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్‌లు కూడా అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు.

ఇద్దరు చెరో 13 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఇలా ప్రతి ఒక్కరూ తమవంతు భూమికను పోషించడంతో టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అంతేగాక టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. ఇదే జోరును వచ్చే నెల బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో కనబరచాలనే పట్టుదలతో టీమిండియా కనిపిస్తోంది. సౌతాఫ్రికా వంటి బలమైన జట్టునే చిత్తుచిత్తుగా ఓడించిన భారత్‌కు బంగ్లాను ఓడించడం కష్టం కాదనే చెప్పాలి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD