ఏజెన్సీ గ్రామాల్లో త్రీ-ఫేస్ కరెంట్

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-11 09:26:54

ఆదిలాబాద్,అక్టోబర్ 10: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీ తాండాలు, గిరిజన గూడేల్లో విద్యుత్ సౌకర్యం మెరుగుపర్చేందుకు త్రిపేజ్ కరెంట్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ముగ్గురు ఐఏఎస్‌లతో ప్రత్యేక కమిటీని నియమించినట్లు ముఖ్యమంత్రి కెసి ఆర్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏజెన్సీ గ్రామాల సమస్యల గురించి సిఎం ప్రస్తావించి పరిష్కారానికి పలు సూచనలు జారీ చేసినట్లు పత్రికా ప్రకటన వెలువడింది. జీవ కోటి మనుగడకు ముప్పుగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తి అమ్మకాలను నిషేదించేలా ప్రత్యేక చట్టం తీసుకవస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ది, పారిశుద్ద్య నిర్వహణలో అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకోవడం వల్లే 30 రోజుల పల్లె ప్రణాళిక సత్ఫాలితాలిచ్చిందని, మొక్కల పెంపకం, పచ్చదనం పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ.2కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నట్లు సిఎం తెలిపారు. అడవులు తక్కువగా ఉన్న చోట మొక్కలు పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకపోవాలని సూచించినట్లు తెలిపారు. గ్రామాల్లోకి వచ్చిన కోతులను అడవి బాట పట్టించేందుకు ప్రత్యేకంగా మంకిఫుడ్ కోర్టులను 1063 ఎకరాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పచ్చదనం, పరిశుభ్రత, గిరిజన సమస్యల గురించి ముఖ్యమంత్రి కలెక్టర్లతో ఆరా తీయగా వీటి పురోగతి గురించి కలెక్టర్లు సిఎంకు వివరించడం గమనార్హం. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య, మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరి, ఆసిఫాబాద్ కలెక్టర్ రాజీవ్ హన్మంతు, నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN