ఐటా తీరుపై మండిపడ్డ భూపతి
న్యూఢిల్లీ: భారత డేవిస్‌కప్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడంపై మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి ఆవేదన వ్యక్తం చేశాడు. టెన్నిస్ కెరీర్‌కు ఎప్పుడో దూరమైన భూపతి.. డేవిస్‌కప్ ఆడే భారత జట్టుకు ఇప్పటివరకూ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఐటా) అతన్ని కెప్టెన్సీ పదవి నుంచి అర్థాంతరంగా తొలగించడంపై భూపతి మండిపడ్డాడు. మరీ ఇంత దారుణంగా వ్యహరిస్తారా? అంటూ ఐటా తీరును తప్పుబట్టాడు. ఈ సంద ర్భంగా భూపతి మాట్లాడుతూ... నేను ఎప్పుడూ ఆటగాళ్ల కోసం వారి రక్షణ కోసం ఆలోచిస్తూ వచ్చాను. దానిలో భాగంగానే డేవిస్‌కప్ మ్యాచ్‌లు ఆడటానికి పాకిస్తాన్ వెళ్లలేమని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటిఎఫ్)కు తేల్చి చెప్పాను. దాంతో తటస్థ వేదికపై ఆడటానికి ఐటిఎఫ్ కూడా గ్రీన్ సిగల్ ఇచ్చింది. అక్టోబర్ 15వ తేదీన జరిగిన ఒక సమావేశానికి నేను కెప్టెన్సీ హోదాలో హాజరయ్యా. ఉన్నట్టుండి నా కెప్టెన్సీకి స్వస్థి పలికారు. నవంబర్ 4వ తేదీన నన్ను కెప్టెన్‌గా తొలగిస్తూ ఐటా సెక్రటరీ జనరల్ హిరోన్మరు ఛటర్జీ ఫోన్లో చెప్పారు. కానీ కారణాలు చెప్పలేదు. విభజించు-పాలించు విధానాన్ని ఐటా అవలంభిస్తోంది' అని మహేశ్ భూపతి విమర్శించాడు.