ఓపెనింగ్‌లో.. రో ‘హిట్‌’

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-03 05:37:18

img

పరిమిత ఓవర్లలో అతడికి తిరుగులేదు.. పిచ్‌, బౌలర్‌తో సంబంధంలేదు.. క్రీజ్‌లో అడుగిడుతూనే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడడమే అతడికి తెలిసింది.. వన్డేలు, టీ20ల్లో డబుల్‌, సెంచరీలతో అలవోకగా వేలాది పరుగులు సాధించినా, టెస్ట్‌ల్లో అదే ప్రదర్శన చేయలేకపోవడం అతడి అభిమానులకేకాదు భారత క్రికెట్‌ ప్రేమికులకు మనస్సు చివుక్కుమనిపించేదే.. వన్డేలు, టీ20లు కలిపి 300కుపైగా మ్యాచ్‌లు ఆడినా టెస్ట్‌లు మాత్రం 27కే పరిమితమయ్యాయి.. కానీ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా కొత్త అవతారంలో రో‘హిట్‌’ అయ్యాడు.. దక్షిణాఫ్రికాతో బుధవారం మొదలైన మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. ఏమాత్రం తొట్రుపాటు లేకుండా తనదైన శైలిలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ సెంచరీ కొట్టేశాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కూడా ధాటిగా ఆడడంతో తొలిరోజు భారత్‌

ఆధిపత్యం చూపింది.

  • సెంచరీతో సత్తా చాటిన శర్మ
  • అదరగొట్టిన అగర్వాల్‌
  • భారత్‌ 202/0
  • వర్షంతో మూడో సెషన్‌ రద్దు
  • దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌

విశాఖపట్నం (స్పోర్ట్స్‌): టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనపై పెట్టుకున్న అంచనాలను రోహిత్‌ శర్మ నిలబెట్టాడు. ఓపెనర్‌గా మొదటి టెస్ట్‌లోనే అదరగొట్టాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో విఫలమవడంతో జట్టులో, ఫ్యాన్స్‌లో ఏర్పడిన ఆందోళనను పటాపంచలు చేశాడు. పరిమిత ఓవర్లకేకాదు, టెస్ట్‌ ఫార్మాట్‌కూ తాను పనికొస్తానని నిరూపించాడు. అజేయ సెంచరీ (174 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 115 బ్యాటింగ్‌)తో కదం తొక్కాడు. అతడికి మయాంక్‌ అగర్వాల్‌ (183 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 బ్యాటింగ్‌) తోడవడంతో మొదటి టెస్ట్‌ తొలిరోజు భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. అయితే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో టీ తర్వాతి సెషన్‌ను అంపైర్లు రద్దు చేశారు.

పేసర్లను అలవోకగా..

టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కోహ్లీ రెండో ఆలోచన లేకుండా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే మాయాంక్‌ అగర్వాల్‌ ఇంతకుముందు ఎప్పుడూ స్వదేశంలో టెస్ట్‌ ఆడకపోగా, రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా అరంగేట్రం. మరోవైపు ఫిలాండర్‌, రబాడ వంటి ‘పేస్‌’ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో అన్న మీమాంస మధ్య మయాంక్‌, రోహిత్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఫిలాండర్‌ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతిని అగర్వాల్‌ చక్కటి కవర్‌ డ్రైవ్‌తో బౌండరీకి తరలించగా..రబాడ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతిని బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా బౌండరీగా మలిచి ఓపెనర్‌ కెరీర్‌ను రోహిత్‌ ఆశావహంగా ప్రారంభించాడు. అంతేకాదు ఫిలాండర్‌ ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా వేసిన బంతిని చక్కటి టైమింగ్‌తో ఫోర్‌గా కొట్టి అలరించాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ను అవుట్‌ చేసిన ఫిలాండర్‌.. బంతిని వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌ చేస్తూ అతడిని ఊరించే ప్రయత్నం చేశాడు. కానీ రోహిత్‌ క్రీజ్‌ బయట స్టాన్స్‌ తీసుకొని బ్యాటింగ్‌ చేయడం ద్వారా ఫిలాండర్‌ను సమర్థంగా అడ్డుకొన్నాడు.

మరోవైపు వేగవంతమైన బంతులు వేసినా.. రోహిత్‌, మయాంక్‌లను రబాడ కూడా పెద్దగా ఇబ్బందిపెట్టలేకపోయాడు. రబాడ వేసిన ఆరో ఓవర్లో ఓ బంతిని అగర్వాల్‌ మూడో స్లిప్‌, గల్లీలోకి కొట్టగా గాల్లోకి లేచింది. అయితే అక్కడ ఫీల్డర్‌ లేకపోవడంతో అగర్వాల్‌ బతికి పోయాడు. ఆ తర్వాత రబాడ బౌలింగ్‌లోనే మయాంక్‌ ఎల్బీ అయ్యే ప్రమాదంనుంచి బయటపడ్డాడు. మొత్తంగా తొలి సెషన్‌ కొద్దిసేపు మాత్రమే దక్షిణాఫ్రికా పేసర్లు భారత ఓపెనర్లను ఇబ్బంది పెట్టగలిగారు. 20వ ఓవర్లో స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో క్రీజ్‌ వెలుపలకు వచ్చి రోహిత్‌ భారీ సిక్సర్‌ బాదడంతో తొలి వికెట్‌కు 50 రన్స్‌ వచ్చాయి. మరో స్పిన్నర్‌ పీడిట్‌ బౌలింగ్‌లోనూ మయాంక్‌ సిక్సర్‌ కొట్టడంతో స్కోరుబోర్డు వేగంగా కదిలింది. స్పిన్నర్‌ ముత్తుసామి బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన రోహిత్‌ టెస్ట్‌ల్లో 11వ హాఫ్‌ సెంచరీ సాధించాడు. దాంతో భోజన విరామానికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 91 పరుగులు చేసింది.

రెండో సెషన్‌లో మరింత దూకుడు..

రెండో సెషన్‌లో భారత ఓపెనర్లు మరింత దూకుడు ప్రదర్శించారు. సౌతాఫ్రికా స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు కొట్టారు. కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ సంధించిన మయాంక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. పీడెట్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్‌.. అరంగేట్ర స్పిన్నర్‌ ముత్తుసామి బౌలింగ్‌లో సింగిల్‌ తీసి టెస్ట్‌ల్లో నాలుగో సెంచరీకి చేరుకున్నాడు. కెప్టెన్‌ కోహ్లీ సహా భారత జట్టు సభ్యులు చప్పట్లు చరుస్తూ రోహిత్‌ను అభినందించారు. సెంచరీ అనంతరం మరింత ధాటిగా ఆడిన రోహిత్‌ ఫిలాండర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.

రెండో సెషన్‌ కొద్దిసేపట్లో ముగియనున్న దశలో దట్టంగా మబ్బులు కమ్ముకొని ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దాంతో టీ బ్రేక్‌కు ముందుగానే వెళ్లారు. ఆ తర్వాత ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మొదటి రోజు ఆటను టీ తర్వాత రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి 59.1 ఓవర్ల ఆట మాత్రమే సాగింది.

బ్రాడ్‌మన్‌ సరసన రోహిత్‌

టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించిన 32 ఏళ్ల రోహిత్‌..తొలి మ్యాచ్‌తోనే దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో రోహిత్‌ ఆడిన 15 ఇన్నింగ్స్‌లలో 98.22 సగటుతో 884 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్‌ తన స్వదేశంలో ఆడిన 50 ఇన్నింగ్స్‌లలో 98.22 సగటుతో 4,322 పరుగులు చేశాడు.

టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా దిగిన తొలిసారే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ. ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, పృథ్వీ షా.. రోహిత్‌కంటే ముందున్నారు.

భారత్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ల్లో రోహిత్‌ అర్ధసెంచరీ సాధించడం ఇది నాలుగోసారి. స్వదేశంలో అతడి గత ఆరు ఇన్నింగ్స్‌ స్కోర్లు 82, 51 నాటౌట్‌, 102 నాటౌట్‌, 65, 50 నాటౌట్‌, 115 నాటౌట్‌.

156 టెస్ట్‌ల్లో భారత్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన 156వ జోడీ రోహిత్‌ శర్మ-మయాంక్‌ అగర్వాల్‌.

టెస్ట్‌ల్లో రోహిత్‌కిది నాలుగో సెంచరీ. ఈ నాలుగు కూడా స్వదేశంలో చేయడం గమనార్హం.

అప్పుడే చెప్పారు..

నేను ఓపెనింగ్‌ చేయాల్సి ఉంటుందని వెస్టిండీస్‌ టూర్లోనే చెప్పారు. దాంతో మానసికంగా సిద్ధమయ్యా. అయితే టెస్ట్‌ల్లో ఓపెనింగ్‌ విభిన్నంగా ఉంటుంది. దానికి సాంకేతికంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త బంతితో ఎదురయ్యే సవాళ్లను

ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను నడిపించడానికి మానసికంగా సన్నద్ధం కావడం ఎంతో ముఖ్యం.

- రోహిత్‌ శర్మ

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (బ్యాటింగ్‌) 84, రోహిత్‌ శర్మ (బ్యాటింగ్‌) 115, ఎక్స్‌ట్రాలు 3, (మొత్తం 59.1 ఓవర్లలో) 202/0

బౌలింగ్‌: ఫిలాండర్‌ 11.1-2-34-0, రబాడ 13-5-35-0, కేశవ్‌ మహరాజ్‌ 23-4-66-0, డేన్‌ పీడిట్‌ 7-1-43-0, సెనురన్‌ ముత్తుసామి 5-0-23-0.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN