కదం తొక్కిన పూనమ్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-12 03:09:47

img

- దక్షిణాఫ్రికా అమ్మాయిలపై ఐదు వికెట్లతో గెలుపు
- వన్డే సిరీస్‌ కైవసం
వడోదర : దక్షిణాఫ్రికా అమ్మాయిలతో తలపడిన రెండో వన్డేలోనూ టీమిండియా అమ్మాయిలు మరో గెలుపును నమోదు చేసుకున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలోనూ భారత్‌ 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్‌ గెలిచిన మిథాలీరాజ్‌ దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ లారా వోల్వార్డ్‌ (69) అర్ద సెంచరీ రాణించింది. వోల్వార్డ్‌కు తోడుగా డు ప్రీజ్‌(44), ఓపెనర్‌ లిజెల్‌ లీ(44) రాణించడంతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శిఖా పాండే, ఏక్తా బిస్త్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారతజట్టు బ్యాటర్స్‌ ప్రియ పూనియా(20), రోడ్రిగ్స్‌(18) నిరాశపర్చినా... మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పూనమ్‌(65), కెప్టెన్‌ మిథాలీరాజ్‌(66) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 129 పరుగులు జోడించి గెలుపు తీరాలకు చేర్చారు. ఆ తర్వాత వీరిద్దరు వెంట వెంటనే పెవీలియన్‌కు చేరినా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(39 నాటౌట్‌) రాణించడంతో భారత్‌ 48 ఓవర్లలో 5 వికెట్లు చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. ఖాకాకు మూడు, ఇస్మాయిల్‌, కాప్‌కు తలా ఒక వికెట్‌ దక్కాయి. ఈ విజయంతో భారత్‌ మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకున్నట్లయ్యింది. మూడో, చివరి వన్డే సోమవారం జరగనుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN