కన్నడ జట్టుదే విజయ్ హజారే
- పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్
- ఫైనల్లో తమిళనాడుపై విజయం
కర్నాటక, తమిళనాడు.. ! డొమెస్టిక్‌లో అతి పెద్ద వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో అద్భుత ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకొచ్చిన జట్లు..! ఇది వరకు ఫైనల్లో ఆడిన ప్రతీసారి టైటిల్ నెగ్గిన జట్లు..! టీమిండియా ఆటగాళ్లు.. డొమెస్టిక్ స్టార్లతో నిండిన ఈ రెండు జట్ల మధ్య అంతిమ పోరులో కర్నాటకదే పైచేయి అయింది..! తన బర్త్ డే రోజున పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో చేలరేగిన వేళ తమిళనాడును చిత్తుగా ఓడించిన కన్నడ జట్టు విజయ్ హజారే ట్రోఫీని నాలుగోసారి సొంతం చేసుకుంది..!
బెంగళూరు : విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక విజయదరహాసం చిందించింది. పేసర్ అభిమన్యు మిథున్(5/34) హ్యాట్రిక్‌కు టీమిండియా ఆటగాళ్లు లోకేశ్ రాహుల్(72 బంతుల్లో 5 ఫోర్లుతో 52 నాటౌట్), మయాంక్ అగర్వాల్(55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 నాటౌట్) మెరుపు బ్యాటింగ్ తోడవడంతో ఆ జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. హోమ్‌గ్రౌండ్‌లో శుక్రవారం వర్షం అంతరాయం కలిగించిన ఫైనల్లో కర్నాటక 60 (వీజేడీమెథడ్లో) పరుగుల తేడాతో ఐదు సార్లు చాంపియన్ తమిళనాడుపై విజయం సాధించింది.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు 49.5 ఓవర్లలో 252కు ఆలౌటైంది. ఓపెనర్ అభినవ్ ముకుంద్(85), బాబా అపరాజిత్(66) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. విజయ్ శంకర్(38), షారుఖ్ ఖాన్(27) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్ మురళీ విజయ్ (0) డకౌటవగా పించ్ హిట్టర్‌గా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(8)తోపాటు కెప్టెన్ దినేశ్ కార్తీక్(11) కూడా నిరాశపరిచారు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షారుఖ్‌ఖాన్, ఎం.మహ్మద్(10), మురుగన్ అశ్విన్(0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన మిథున్ హ్యాట్రిక్‌తో తమిళనాడు ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన కర్నాటక తొలి బౌలర్‌గా మిథున్ రికార్డు సృష్టించాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన కర్నాటకకు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఐదో ఓవర్లోనే షాకిచ్చాడు. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్(11)ను సుందర్ బౌల్డ్ చేశాడు. దీంతో మరో ఓపెనర్ రాహుల్‌కు మయాంక్ జత కలిశాడు. వాన ముప్పు ఉండడంతో దూకుడుగా ఆడిన వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేయడంతోపాటు స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. దీంతో వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సరికి కర్నాటక 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేకపోవడంతో వీజేడీ పద్ధతి ప్రకారం సాధించాల్సిన లక్ష్యం కంటే కర్నాటక అప్పటికే 87 రన్స్ ఎక్కువ చేసింది. దీంతో కర్నాటకను విజేతగా ప్రకటించారు. విజయ్ హజారే ఫైనల్లో ఇప్పటిదాకా ఓటమి ఎరుగుని జట్టుగా కర్నాటక నిలవగా తమిళనాడు తొలిసారి ఓడిపోయింది. అభిమన్యు మిథున్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
తమిళనాడు: 252 ఆలౌట్(అగర్వాల్ 85, బాబా అపరాజిత్ 66, మిథున్ 5/34, కౌశిక్ 2/39 ). కర్నాటక: 146/1 ( లోకేశ్ రాహుల్52 నాటౌట్, మయాంక్ అగర్వాల్ 69 నాటౌట్, వాషింగ్టన్ సుందర్ 1/51)