కర్ణాటకదే విజయ్ హజారే
* టైటిల్ వేటలో మెరిసిన రాహుల్, అగర్వాల్
* అభిమన్యు మిధున్ హ్యాట్రిక్
బెంగళూరు: ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం తమిళనాడుతో జరిగిన ఫైనల్ పోరులో కర్ణాటక (విజెడి పద్ధతిలో) 60 పరుగుల తేడాతో గెలిచి నాల్గవసారి విజయ్ హజారే టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 253 పరుగులు సాధించగా, అందుకు ధీటుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక 23 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 146 పరుగులతో ఉన్న సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆపై ఫలితం కోసం విజెడి పద్ధతిని అవలంభించి కర్ణాటకను విజేతగా తేల్చారు. కర్ణాటక ఓపెనర్ కెఎల్ రాహుల్(52 నాటౌట్), మయాంక్ అగర్వాల్(69 నాటౌట్)లు మెరిశారు. వీరిద్దరూ అజేయంగా 112 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి కర్ణాటకను పటిష్టస్థితిలో నిలిపారు. ఈ టోర్నీలో కెఎల్ రాహుల్ 598 పరుగులు చేయడం విశేషం. అంతకుముందు టాస్ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో అభినవ్ ముకుంద్-మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే విజయ్ డకౌట్‌గా పెవిలియన్ చేరితే ముకుంద్(85) రాణించాడు. ఆ తర్వాత బాబా అపరాజిత్(66), విజరు శంకర్(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి తమిళనాడును దెబ్బకొట్టాడు. మిథున్‌కు ఐదు, కౌశిక్‌కు రెండు వికెట్లు, ప్రతీక్ జైన్, కృష్ణప్ప గౌతమ్‌లకు తలో వికెట్ లభించింది.
హ్యాట్రిక్‌తో మెరిసిన మిధున్ :
కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. చివరి ఓవర్ మూడో బంతికి షారుఖ్(27) వికెట్ సాధించిన మిథున్.. ఆపై వరుస రెండు బంతుల్లో ఎమ్ మహ్మద్((10), మురుగన్ అశ్విన్(0)లను పెవిలియన్‌కు పంపించాడు. ఫలితంగా హ్యాట్రిక్‌తో అరుదైన ఘనతను నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో హ్యాటిక్ర్ వికెట్లు సాధించిన తొలి కర్ణాటక బౌలర్‌గా నిలిచాడు. శుక్రవారం (అక్టోబర్ 25) మిధున్ పుట్టినరోజు కావడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో మిథున్ ఐదు వికెట్లతో అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్...
తమిళనాడు : 49.5 ఓవర్లలో 252ఆలౌట్
(ముకుంద్ 85, అపరాజిత్ 66, మిథున్ 5/34)
కర్ణాటక : 23 ఓవర్లలో 146/1
(మయాంక్ 69నాటౌట్, కెఎల్ రాహుల్ 52నాటౌట్, సుందర్ 1/51)
ఫలితం: విజెడి పద్ధతిపై 60 పరుగులతో కర్ణాటక విజయం