కలెక్టరేట్ల ఎదుట రిలే దీక్షలు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-08 07:05:53

img

హైదరాబాద్, నవంబర్ 7: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. మండలస్థాయి నుండి మొదలుకుని భూపరిపాల ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం వరకు అన్ని స్థాయిలలో ధర్నాలు, సమావేశాలు నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు సాగాయి. ఈ సందర్భంగా మెడ్చెల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ల ముందు జరిగిన రిలే నిరాహార దీక్ష శిబిరాల వద్ద రెవెన్యూ జేఏసి నాయకులు వి. లచ్చిరెడ్డి, ఎస్. రాములు, గరికే ఉపేంద్రరావు తదితరులు మాట్లాడుతూ, రిలే నిరాహార దీక్షలను కొనసాగించాలని పిలుపు ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అన్ని సంఘాల అభిప్రాయాల మేరకు భవిషత్యత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులను బదనాం చేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ శాఖ ఏర్పడ్డప్పటి నుండి ఇలాంటి ఇబ్బంది చూడలేదన్నారు. ప్రభుత్వాలు ఏవి ఉన్నప్పటికీ, రెవెన్యూ శాఖనే పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తోందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న లోపభూయిష్టమైన రెవెన్యూ చట్టాలు, సాఫ్ట్‌వేర్ వల్ల రెవెన్యూ సిబ్బంది బదనాంకు గురవుతోందన్నారు. భూపరిపాలన నుండి రెవెన్యూ శాఖను మినహాయించాలని డిమాండ్ చేశారు.
డ్రైవర్ కుటుంబానికి రూ. లక్ష సాయం
విజయారెడ్డి డ్రైవర్‌గా పనిచేస్తూ అగ్నికి ఆహుతైన గురునాథం కుటుంబానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) లక్ష రూపాయలు అందించింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామంలో గురునాథం కుటుంబాన్ని అసోసియేషన్ ప్రతినిధులు వంగా రవీందర్‌రెడ్డి, కె. గౌతం కుమార్ తదితరులు గురువారం పరామర్శించారు. గురునాథం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు, ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గురునాథం కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు.

*చిత్రం...వికారాబాద్‌లో ధర్నాలో పాల్గొన్న రెవెన్యూ సిబ్బంది

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD