కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన హర్మన్‌ప్రీత్.. వీడియో వైరల్
అంటిగ్వా: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం విండీస్ మహిళా జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ ప్రియా పునియా 75 పరుగులతో అదరగొట్టినప్పటికీ చివరల్లో ఏక్తాబిష్త్, పూనమ్ యాదవ్‌లు వరుస బంతుల్లో పెవిలియన్ చేయడంతో భారత్ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. కాగా, బ్యాటింగ్‌లో విఫలమైన హర్మన్‌ప్రీత్ కౌర్ (5), ఫీల్డింగ్‌లో ఇరగదీసింది. లాంగాన్ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్ సంచలనమైంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ చెలరేగిపోయింది. 91 బంతుల్లో 94 పరుగులు చేసి ఆరు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకుంది. ఏక్తాబిష్త్ బౌలింగ్‌లో స్టెఫానీ సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేయాలనుకుంది. అనుకున్నట్టే లాంగన్ మీదుగా భారీ షాట్ కొట్టింది. హర్మన్ ప్రీత్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆమె సెంచరీ పూర్తయ్యేదే. అయితే, హర్మన్‌ప్రీత్ అమాంతం గాల్లోకి ఎగిరి స్టాండ్స్ వైపు దూసుకెళ్తున్న బంతిని ఎడమచేత్తో అందుకుని స్టెఫానీకి షాకిచ్చింది. హర్మన్‌ప్రీత్ క్యాచ్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 224 పరుగులకు ఆలౌటైంది.