కష్టాలు నేర్పిన ఆట

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-03 08:01:45

img

పేదరికం కడు శాపం.. బతుకు నిత్య నరకం.. భగవంతుడా అంటూ చుట్టూ కమ్మిన చీకటిని నిందిస్తూ.. అందులోనే కలసిపోయే జీవితాలెన్నో! కానీ, 17 ఏళ్ల కుర్ర క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ ఆలోచన, ప్రపంచాన్ని అతడు చూసిన విధానమే వేరు. పేదరికం శాపం కాదు.. అదే తన బలమని నమ్ముతున్నాడు. బాల్యం నుంచి నిత్య కష్టాల్లో మగ్గి రాటుదేలిన ఈ క్రికెటర్‌.. లిస్ట్‌-ఎలో డబుల్‌ సెంచరీతో ‘టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌’గా మారాడు. ఉండటానికి వసతి లేదు.. తినడానికి తిండి లేదు.. ఆకలితో అలమటిస్తున్నా గుప్పెడు మెతుకులు దొరకని స్థితి. అయినా క్రికెటర్‌ కావాలనే అతడి సంకల్పం ముందు అవన్నీ బలాదూర్‌ అన్నాయి. ఆటతోనే ఆకలిని జయించాడు.. పరుగులతోనే దాహాన్ని తీర్చుకుంటున్నాడు. కష్టాల కొలిమిలో కాలినా.. పరిస్థితులు పరీక్షించినా.. ఆత్మస్థయిర్యంతో వాటిని ఎదిరించి.. ఆటే ఆశగా, శ్వాసగా.. క్రికెట్‌ తపస్విగా మారాడు యశస్వి.

జ్వాల కంట పడడంతో..

కోచ్‌ జ్వాలా సింగ్‌ చూడడం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. డివిజన్‌-ఎ పేసర్లను ఎదుర్కొంటూ అతడు ఆడే స్ట్రోక్‌ ప్లే జ్వాలను ఆకట్టుకుంది. మిగతా వారి ద్వారా అతడి పరిస్థితిని తెలుసుకొని తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. తినడానికి తిండి, ఉండడానికి గూడు దొరకడంతో యశస్వి బెంగ తీరింది. దీంతో క్రికెట్‌పైనే తన మనసును లగ్నం చేశాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, స్పిన్నర్‌గా స్కూల్‌ క్రికెట్‌లో రికార్డుల మోత మోగించిన జైస్వాల్‌.. శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌-19 టీమ్‌లో చోటుదక్కింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా.. ఆ తర్వాత 114 పరుగులతో సత్తాచాటాడు. ఆసియా కప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచిన యశస్వి.. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రంజీల్లోకి అడ్డుపెట్టాడు. ఏక కాలంలో జూనియర్‌ క్రికెట్‌, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో డబుల్‌ సెంచరీకి ముందు నాలుగు శతకాలు బాదాడు.

విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి మనోనిబ్బరం ప్రదర్శించాలి.. ఎలా ఎదుర్కోవాలని.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అవకాశాలను ఎలా సృష్టించుకోవాలనే సానుకూలతను కలిగించేందుకు ఏర్పాటు చేసేదే బూట్‌ క్యాంప్‌. మెగా టోర్నీల సమయంలో ఆటగాళ్లకు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు సాధారణం. ముంబై క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ జీవితమే పెద్ద బూట్‌ క్యాంప్‌. విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ద్విశతకంతో అతడి పేరు దేశమంతా మార్మోగి పోతోంది. లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా యశస్వి వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. కష్టాలకు వెరవకుండా.. తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు.

చిన్ననాటి నుంచే..

ఉత్తరప్రదేశ్‌లోని భాడోహిలో ఓ పేద కుటుంబంలో జన్మించాడు యశస్వి జైస్వాల్‌. కానీ, చిన్నప్పటి నుంచి క్రికెటర్‌ కావాలనేది అతడి కల. అది నెరవేర్చుకోవడం అక్కడ ఉంటే సాధ్యం కాదు. ఏమీ తెలియని 11 ఏళ్ల వయసులో క్రికెట్‌ కోసమే ముంబై రైలెక్కేశాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో అతడి తండ్రి కూడా అభ్యంతరం చెప్పలేదు. ముంబై చేరుకున్న తర్వాత ఓ పాలకేంద్రంలో అతడు పనికి కుదిరాడు. అయితే, క్రికెట్‌పైనే ధ్యాస పెడుతూ.. పని సరిగా చేయకపోవడంతో జైస్వాల్‌ను అక్కడి నుంచి పంపేశారు. దీంతో తెలిసిన బంధువొకరి ఇంట్లో కొన్ని రోజులు ఆశ్రయం పొందాడు. కానీ వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో ఆయన యశస్విని ఆజాద్‌ మైదానంలోని ముస్లిం యునైటెడ్‌ క్లబ్‌ టెంట్‌లో ఉండేలా ఏర్పాటు చేశాడు. ఒక రకంగా ఇదే అతడికి వరంగా మారింది. టెంట్‌లో కరెంటు, టాయిలెట్‌ సౌకర్యాలు కూడా లేవు. కానీ, వేరే దారిలేక అక్కడే సర్దుకున్నాడు. ఉదయం, సాయంత్రం క్రికెట్‌ ఆడేవాడు. డబ్బు కోసం పానీపూరీలు అమ్మడం, ఇతర పనులు చేస్తుండేవాడు. అలా వచ్చిన సొమ్ముతో తన అవసరాలు తీర్చుకునేవాడు. డబ్బులు లేక కడుపు మాడ్చుకుని పడుకోవడం అతడికి మామూలే అయింది. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా క్రికెట్‌ను మాత్రం అతడు విడిచిపెట్టలేదు. అతడి ప్రతిభను గుర్తించిన స్థానిక ఆటగాళ్లు, కోచ్‌లు ఎంతో ప్రోత్సహించడంతో దూసుకుపోయాడు.

జాఫర్‌ను చూసి..

శుభారంభాలను భారీస్కోర్లుగా ఎలా మలచాలో రంజీ దిగ్గజం వసీమ్‌ జాఫర్‌ను చూసి జైస్వాల్‌ నేర్చుకున్నాడు. ‘అర్ధ శతకాలను భారీ స్కోర్లుగా మార్చలేని బలహీనత నన్ను వెంబడించేది. అయితే, ఒక సమయంలో జాఫర్‌ సెంచరీ చేయడాన్ని నిశితంగా గమనించా. అప్పటి నుంచి నా ఆటలో మార్పులు చేసుకున్నా. జాఫర్‌ కూడా ఎన్నో విలువైన సలహాలు ఇచ్చాడ’ని యశస్వి చెప్పాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN