కింగ్స్ హెడ్‌కోచ్‌గా కుంబ్లే

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-12 05:27:00

-ఐపీఎల్‌లో అనిల్ కొత్త ఇన్నింగ్స్..
-ప్రతిభాన్వేషణకు వాల్ష్ నియామకం
న్యూఢిల్లీ : భారత స్పిన్ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే ఐపీఎల్‌లో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు హెడ్‌కోచ్‌గా అతడు నియమితుడయ్యాడు. ఈనెల 19 నుంచి జట్టు వ్యవహారాల బాధ్యతలను స్వీకరించనున్నాడు. ప్రస్తుతం జట్టు కెప్టెన్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ను కొనసాగించాలా వద్దా అనే అంశం కూడా కుంబ్లే ఆ రోజునే నిర్ణయించే అవకాశం ఉంది. రెండేండ్లుగా కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న అశ్విన్.. వచ్చే సీజన్‌కు ఢిల్లీకి వెళ్తాడనే అంచనాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లో జట్లకు ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న ఏకైక భారతీయ క్రికెటర్ అనిల్ కుంబ్లేనే కానుండడం విశేషం. అలాగే జట్టు కోసం ప్రతిభావంతులైన ఆటగాళ్లను అన్వేషించేందుకు వెస్టిండీస్ దిగ్గజం కౌట్నీ వాల్ష్‌ను టాలెంట్ స్కౌంట్ పదవిలో కింగ్స్ ఎలెవెన్ నియమించుకుంది. ఆటగాళ్లను కొనసాగించాలా.. వేలానికి విడుదల చేయాలా అన్న విషయం కుంబ్లే నిర్ణయిస్తాడు. ఐపీఎల్ కంటే ముందు జరిగే ముస్తాక్ అలీ టోర్నీలో ప్రతిభ గల ఆటగాళ్లను ఎంపిక చేసే విధులను వాల్ష్ నిర్వర్తిస్తాడు. అలాగే జట్టు పేసర్లకు దిశానిర్దేశం చేస్తాడు అని కింగ్స్ ఎలెవెన్ యాజమాన్యానికి చెందిన ఒకరు చెప్పారు. కింగ్స్ ఎలెవెన్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి, ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా గ్రేట్ జాంటీ రోడ్స్, బ్యాటింగ్ కోచ్‌గా జార్జ్ బెయిలీ ఉండగా కుంబ్లే రాకతో మరింత పటిష్ఠమైంది. 2014లో ఫైనల్‌లో ఓడిన కింగ్స్ ఎలెవెన్.. 2015, 2016 సీజన్లలో పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది. చివరి మూడు సీజన్లలో ఐదు(2017), ఏడు(2018), ఆరో(2019) స్థానాలతోనే సరిపెట్టుకుంది. 2016 జూన్‌లో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన అనిల్.. కెప్టెన్ కోహ్లీతో విభేదాల కారణంగా 2017లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
imgఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి మూడు సంవత్సరాల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన కుంబ్లే 2009, 2010లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు ముంబై ఇండియన్స్ మెంటార్‌గా పనిచేశాడు. ఇప్పుడు కింగ్స్ ఎలెవెన్‌కు హెడ్‌కోచ్‌గా ఐపీఎల్‌లో మరోసారి అడుగుపెడుతున్నాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD