కొరివితో తల గోక్కోవడమే..

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-07 09:16:46

హైదరాబాద్, అక్టోబర్ 6: ఆర్టీసీ కార్మికులతో పెట్టుకోవడమంటే కొరివితో తల గోక్కోవడమేనని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలంలో చేసిన ప్రకటనను గుర్తుపెట్టుకుని ఆర్టీసీ సిబ్బంది డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఖాళీల భర్తీని తక్షణమే చేపట్టాలని, కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రతను కల్పించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని, మహిళా కండక్టర్ల విధులు రాత్రి 8 గంటల లోపు ముగిసేలా చూడాలని, జీతాలు ప్రతి నెలా మొదటి తేదీనే ఇవ్వాలని, కార్మికులు చేస్తున్న డిమాండ్లలో న్యాయం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అద్వితీయమైందన్నారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వేలాది మంది ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. గత ఐదున్నరేళ్లలో ఆర్టీసీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రైవేటీకరణ చేయాలన్న ప్రయత్నాలు బెడిసికొడతాయని, ఈ దిశగా చేస్తున్న కుట్రలను మానుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా 15 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకుదిగారన్నారు. నియంతృత్వ మొండి వైఖరితో సమ్మె తప్ప మరో మార్గం లేకుండా పోయిందన్నారు. గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా కార్మిక సంఘాలను ప్రగతిభవన్‌కు పిలిచి మాట్లాడారా? అని ప్రశ్నించారు. చిరు ఉద్యోగులపై నియంతృత్వ వైఖరిని ప్రదర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. డెడ్‌లైన్ లోపు విధుల్లో చేరకుంటే ఉద్యోగాలు పీకేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి చిరు ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయడం సీఎం స్థాయికి తగని హేయమైన చర్య అన్నారు. రాష్ట్రప్రభుత్వం పంతాలకు పోకుండా మెట్టు దిగి ఆర్టీసీ కార్మికులతో మాట్లాడాలన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN