కోహ్లిసేన గుప్పిట్లో పుణె

Nava Telangana

Nava Telangana

Author 2019-10-13 06:27:11

- 326 పరుగుల భారీ ఆధిక్యం
- 375కే కుప్పకూలిన దక్షిణాఫ్రికా
- అశ్విన్‌ నాలుగు వికెట్ల మాయజాలం
- పుణె టెస్టు మూడో రోజు
నవతెలంగాణ-పుణె
కేశవ్‌ మహరాజ్‌ (72, 132 బంతుల్లో 12 ఫోర్లు), వెర్నన్‌ ఫిలాండర్‌ (44 నాటౌట్‌, 192 బంతుల్లో 6 ఫోర్లు) దక్షిణాఫ్రికా స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌ నాయకులు. పుణె టెస్టులో ఈ జోడీ తమ బాధ్యతను బంతి నుంచి బ్యాట్‌కు మార్చుకుంది. 162/8తో పతనావస్థలో నిలిచిన దక్షిణాఫ్రికాకు తొమ్మిదో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. సఫారీ కథ ముగించటంపై కోహ్లిసేన ఆత్రుతకు చెక్‌ పెట్టింది. సుమారు 43 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి భారత బౌలర్లను విసిగించింది. విశాఖ టెస్టులో సెనురన్‌ ముతుసామి, డేన్‌ పీట్‌ జోడీ తొమ్మిదో వికెట్‌కు 91 పరుగులు జోడించి ఆఖర్లో ఇన్నింగ్స్‌కు ఊపిరి అందించగా.. పుణెలో ఆ పని మహరాజ్‌, ఫిలాండర్‌ జోడీ చేసింది. మహరాజ్‌ కెరీర్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడగా.. ఫిలాండర్‌ చక్కటి ఏకాగ్రత ప్రదర్శించాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (64, 117 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) పతనంతో సఫారీ పని అయిపోయినట్టే అనుకున్నారు. కానీ మహరాజ్‌, ఫిలాండర్‌లు అసమాన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఓ విధంగా దక్షిణాఫ్రికాకు ఇన్నింగ్స్‌ ఓటమి గండం తప్పించారు!. టెయిలెండర్లు వికెట్‌ నిరాకరించినా.. స్పిన్నర్‌ అశ్విన్‌, సీమర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మెరుపులకు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే కుప్పకూలింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ తొలి ఇన్నింగ్స్‌కు ముగింపు పడింది. భారత్‌ 326 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నేడు కోహ్లిసేన మరోసారి బ్యాటింగ్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. 105.4 ఓవర్లు వేసిన బౌలింగ్‌ బృందానికి మరో రెండు సెషన్ల పాటు విశ్రాంతి ఇచ్చేందుకు కెప్టెన్‌ మొగ్గు చూపుతున్నాడు!. తొలి రెండు సెషన్లలో వేగంగా పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు కొండంత లక్ష్యం ఉంచటం లాంఛనమే!.
టపటపా టాప్‌ లేపారు : ఓవర్‌ నైట్‌ స్కోరు 36/3తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికాకు సీమర్లు ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి చుక్కలు చూపించారు. తొలి సెషన్‌లో దక్షిణాఫ్రికా 100 పరుగులు చేసినా.. కీలక మూడు వికెట్లు కోల్పోయింది. నైట్‌ వాచ్‌మన్‌ అన్రిచ్‌ (3)ను నాల్గో స్లిప్స్‌లో మహ్మద్‌ షమి అవుట్‌ చేయగా.. తర్వాత పని ఉమేశ్‌ యాదవ్‌ చూసుకున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ బంతిని ఆడాలా వద్దా అనే మీమాంసలో కనిపించిన డీ బ్రూయిన్‌ (30, 58 బంతుల్లో 6 ఫోర్లు) వికెట్ల వెనకాల క్యాచౌట్‌ అయ్యాడు. కుడి వైపు డైవ్‌ చేస్తూ సాహా చూడచక్కని క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా 53/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సమయంలో కెప్టెన్‌ డుప్లెసిస్‌ (64)తో కలిసి క్వింటన్‌ డికాక్‌ (31, 48 బంతుల్లో 7 ఫోర్లు) కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆరో వికెట్‌కు 75 పరుగులు జోడించి వికెట్ల పతనం అడ్డుకున్నాడు. లంచ్‌ విరామానికి ముందు అశ్విన్‌ మాయకు డికాక్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. డికాక్‌ ఫుట్‌వర్క్‌ లోపాన్ని ఆయుధంగా చేసుకున్న అశ్విన్‌ కండ్లుచెదిరే రీతిలో వికెట్లను గిరాటేశాడు.
ఆఖర్లో అసమాన పోరాటం : కెప్టెన్‌ డుప్లెసిస్‌ 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సిరీస్‌లో మరో అర్ధ సెంచరీ సాధించాడు. స్వేచ్ఛగా కవర్‌ డ్రైవ్‌లు ఆడిన డుప్లెసిస్‌ క్రీజులో కుదురుకున్నాడు. లోయర్‌ ఆర్డర్‌తో కలిసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ముందుకు లాగించేందుకు ప్రయత్నించాడు. కానీ మరోసారి అశ్విన్‌ వలలో పడి వికెట్‌ కోల్పోయాడు. విశాఖ టెస్టులో అజేయంగా నిలిచిన సెనురన్‌ ముతుసామి (7) అప్పటికే జడేజాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. డుప్లెసిస్‌ సైతం పెవిలియన్‌ చేరాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 162/8. టెయిలెండర్లు ఎంత సేపు ఆడతారులే అనుకున్న భారత్‌కు వెర్నన్‌ ఫిలాండర్‌, కేశవ్‌ మహరాజ్‌ చుక్కలు చూపించారు. తొమ్మిదో వికెట్‌కు 259 బంతులు ఎదుర్కొన్న ఫిలాండర్‌, మహరాజ్‌ 109 పరుగులు జోడించారు. భారత్‌లో 9, 10 వికెట్లకు ఇన్ని బంతులు ఎదుర్కొన్న ఈ జోడీ వీరిదే. సహజంగా టెయిలెండర్లు వచ్చీ రాగానే బాదటం మొదలు పెడతారు. కానీ ఫిలాండర్‌ ఎదుర్కొన్న 22 బంతుల తర్వాత పరుగుల ఖాతా తెరిచాడు. మరో ఎండ్‌లో మహరాజ్‌ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ స్థాయి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 9 ఫోర్లతో 96 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన మహరాజ్‌ కెరీర్‌ బెస్ట్‌ 72 పరుగులు సాధించాడు. వ్యక్తిగత స్కోరు 44 వద్ద అశ్విన్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చినా.. స్టార్‌ స్పిన్నర్‌ అందుకోలేదు. ఆ తర్వాత మరింత జాగ్రత్తగా ఆడిన మహరాజ్‌ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ లోటును భారీగా తగ్గించాడు. మూడో రోజు ఆట చివర్లో అశ్విన్‌ ఓవర్లోనే వికెట్‌ కోల్పోయాడు. కగిసో రబాడ (2)ను సైతం అశ్వినే సాగనంపాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు 275 పరుగుల వద్ద ముగింపు పలికాడు.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 601/5 డిక్లేర్డ్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : డీన్‌ ఎల్గార్‌ (బి) ఉమేశ్‌ యాదవ్‌ 6, ఎడెన్‌ మార్క్‌రం (ఎల్బీ) ఉమేశ్‌ యాదవ్‌ 0, డీ బ్రూయిన్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ యాదవ్‌ 30, తెంబ బవుమా (సి) సాహా (బి) మహ్మద్‌ షమి 8, అన్రిచ్‌ నొర్జె (సి) కోహ్లి (బి) మహ్మద్‌ షమి 3, డుప్లెసిస్‌ (సి) అజింక్య రహానె (బి) అశ్విన్‌ 64, క్వింటన్‌ డికాక్‌ (బి) అశ్విన్‌ 31, సెనురన్‌ ముతుసామి (ఎల్బీ) రవీంద్ర జడేజా 7, వెర్నన్‌ ఫిలాండర్‌ నాటౌట్‌ 44, కేశవ్‌ మహరాజ్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) అశ్విన్‌ 72, కగిసో రబాడ (ఎల్బీ) అశ్విన్‌ 2, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (105.4 ఓవర్లలో ఆలౌట్‌) 275.
వికెట్ల పతనం : 1-2, 2-13, 3-33, 4-41, 5-53, 6-128, 7-139, 8-162, 9-271, 10-275.
బౌలింగ్‌ : ఇషాంత్‌ శర్మ 10-1-36-0, ఉమేశ్‌ యాదవ్‌ 13-2-37-3, రవీంద్ర జడేజా 36-15-81-1, మహ్మద్‌ షమి 17-3-44-2, అశ్విన్‌ 28.4-9-69-4, రోహిత్‌ శర్మ 1-1-0-0.
50 దక్షిణాఫ్రికాతో 50 ప్లస్‌ వికెట్లు కూల్చిన నాల్గో భారత బౌలర్‌ అశ్విన్‌. అనిల్‌ కుంబ్లే (84), జవగళ్‌ శ్రీనాథ్‌ (64), హర్బజన్‌ సింగ్‌ (60) ముందున్నారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN