కోహ్లీ సేన వరల్డ్‌ రికార్డ్‌ విజయం వరుసగా 11

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-14 04:10:32

img

  • సిరీస్‌ భారత్‌ కైవసం
  • రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 137 రన్స్‌తో దక్షిణాఫ్రికా చిత్తు

టీమిండియా మరో ఆల్‌రౌండ్‌ షో. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబరచిన వేళ రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 137 పరుగులతో ఘన విజయం సాధించింది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. అంతేకాదు స్వదేశంలో వరుసగా 11వ సిరీస్‌ విజయంతో టీమిండియా వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించింది. కోహ్లీ కెప్టెన్సీ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఫీల్డర్ల మోహరింపు, ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన విధానం, బౌలింగ్‌లో మార్పు చేర్పులు అన్నీ అతడి సారథ్య నైపుణ్యానికి మెచ్చుతునకలు. ఫలితంగా కెప్టెన్‌గా 50 టెస్ట్‌లో అపురూప కానుక అందుకున్నాడు. ఇక సౌతాఫ్రికా జట్టు విశాఖ టెస్ట్‌ మాదిరే మొదటి ఇన్నింగ్స్‌లో అదుర్స్‌, రెండో ఇన్నింగ్స్‌లో తుస్‌. ఫిలాండర్‌, మహరాజ్‌ ఆ మాత్రమైనా ఆడకుంటే సఫారీలకు మరింత ఘోర పరాభవం ఎదురయ్యేది!

స్వదేశంలో టీమిండియాకిది వరుసగా 11వ టెస్ట్‌ సిరీస్‌ విజయం. 2012-13లో భారత్‌ విజయపరంపర ప్రారంభమైంది. 10 వరుస టెస్ట్‌ సిరీస్‌ విజయాలతో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్‌ బద్దలు కొట్టింది. అయితే ఆస్ట్రేలియా 10 వరుస సిరీస్‌ విజయాలు రెండుసార్లు దక్కించుకుంది.

పుణె: మన బౌలర్లు మరోసారి అదరగొట్టారు. కెప్టెన్‌ తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో వందకుపైగా ఓవర్లు బౌలింగ్‌ చేసిన అలసటను దరిచేరనీయకూడా రెండో ఇన్నింగ్స్‌లో అమోఘ ప్రదర్శన చేశారు. రెండోరోజూ దాదాపు 70 ఓవర్లు బౌలింగ్‌ చేశారు. వరుస విరామాల్లో దక్షిణాఫ్రికా వికెట్లు పడగొట్టారు. ఫలితమే రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ గెలుపుతో సిరీస్‌ భారత్‌ వశమైంది. 326 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్‌ చేపట్టిన సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలారు. ఎల్గర్‌ (48), బవుమా (38), ఫిలాండర్‌ (37), కేశవ్‌ మహరాజ్‌ (22) ఒకింత పోరాడారు. ఉమేష్‌ యాదవ్‌ (3/22), జడేజా (3/52) మూడేసి వికెట్లు, అశ్విన్‌ (2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌, షమికి ఒక్కో వికెట్‌ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. విశాఖలో జరిగిన తొలి టెస్ట్‌లో 203 పరుగులతో గెలుపొందిన భారత్‌, ఈ టెస్ట్‌ విజయంతో సిరీస్‌ చేజిక్కించుకుంది. మూడో టెస్ట్‌ ఈనెల 19నుంచి రాంచీలో జరగనుంది.

ఫాలో ఆన్‌..

మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా లోయరార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అలవోకగా బ్యాటింగ్‌ చేయడంతో వికెట్‌లోని జీవం తగ్గిపోతున్నదని కెప్టెన్‌ కోహ్లీ గ్రహించాడు. కొద్దిగా సహకరిస్తున్న పిచ్‌ను సద్వినియోగం చేసుకొనే ఉద్దేశంతో దక్షిణాఫ్రికాను ఫాలోఆన్‌ ఆడించాలని నిర్ణయించాడు. దాంతో ఆదివారం, నాలుగోరోజు ఉదయం సఫారీలు రెండో ఇన్నింగ్స్‌ చేపట్టగా..తొలి ఓవర్‌ రెండో బంతికే ఇషాంత్‌ ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఫుల్‌ లెంగ్త్‌ డిప్పర్‌తో మార్‌క్రమ్‌ (0)ను ఎల్బీగా బలిగొన్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లోనూ సున్నా చుట్టడంతో ఆత్మవిశ్వాసం లోపించిన మార్‌క్రమ్‌..అంపైర్‌ లాంగ్‌ నిర్ణయంపై సహచరుడు ఎల్గర్‌తో చాలాసేపు చర్చించినా అది ఎల్బీనో కాదో తేల్చుకోలేకపోయాడు. అయితే, ఆ బంతి లెగ్‌స్టంప్‌ ఆవలిగా పడినట్టు రీప్లేలలో తేలడం గమనార్హం. సున్నా పరుగులకే తొలి వికెట్‌ కోల్పోగా..కొద్దిసేపటికే ఉమేష్‌ బంతిని కవర్‌ డ్రైవ్‌ చేయబోయిన డిబ్రుయిన్‌ (8) కీపర్‌ సాహా పట్టిన అద్భుత క్యాచ్‌తో అవుటయ్యాడు.

ఈ దశలో ఎల్గర్‌, కెప్టెన్‌ డుప్లెసి మూడో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా వరుస ఫోర్లతో ఎల్గర్‌ దూకుడు ప్రదర్శించాడు. అశ్విన్‌ వేసిన ఓ బంతి అనూహ్యంగా స్పిన్‌ అయ్యి డుప్లెసి ప్యాడ్‌ను తాకుతూ వెళ్లగా సాహా మరోసారి అమోఘంగా దాన్ని పట్టేశాడు. హాఫ్‌ సెంచరీకి చేరువైన ఎల్గర్‌ను కూడా ఉమేష్‌ పట్టిన చక్కటి క్యాచ్‌తో అశ్విన్‌ పెవిలియన్‌కు చేర్చగా..డికాక్‌ (5), కుదురుకున్న బవుమాను జడేజా, ముత్తుసామి (9)ని షమి అవుట్‌ చేశారు. దాంతో 129/7తో సౌతాఫ్రికా ఘోర పరాజయం అంచున నిలిచింది. కానీ మళ్లీ ఫిలాండర్‌, కేశవ్‌ మహరాజ్‌ పోరాడి ఎనిమిదో వికెట్‌కు 56 రన్స్‌ జోడించి ఆదుకున్నారు. సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఫిలాండర్‌ను అవుట్‌ చేసిన ఉమేష్‌ ఈ జోడీని విడగొట్టి జట్టుకు ఊరటనిచ్చాడు. ఇక మహరాజ్‌ను జడేజా ఎల్బీగా బలిగొనగా.. ఆపై రబాడను కూడా ఉమేష్‌ అవుట్‌ చేయడంతో టీ తర్వాత కొద్దిసేపటికి దక్షిణాఫ్రికా ఆలౌటైంది.

11 ఏళ్ల తర్వాత...

11 ఏళ్ల సుదీర్ఘ విరామానంతరం దక్షిణాఫ్రికాను ఫాలోఆన్‌ ఆడించిన జట్టుగా భారత్‌ ఘనత వహించింది. 2008లో చివరిసారిగా సౌతాఫ్రికాను ఇంగ్లండ్‌ ఫాలోఆన్‌ ఆడించింది. అలా గే దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం.

మన ఆధిక్యం 140 పాయింట్లు

టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా భారత జట్టు తానాడిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఏకంగా 200 పాయింట్లతో ‘టాప్‌’లో కొనసాగుతోంది. రెండేసి టెస్ట్‌లాడిన న్యూజిలాండ్‌, శ్రీలంక చెరో మ్యాచ్‌ నెగ్గి 60 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంటే రెండోస్థానంలో ఉన్న జట్టుకంటే భారత్‌ 140 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ఐదేసి టెస్ట్‌లాడిన ఆస్ర్టేలియా, ఇంగ్లండ్‌ చెరో 56 పాయింట్లతో 4,5 స్థానాల్లో నిలిచాయి. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ ఆడిన రెండింటిలోనూ ఓడగా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఇంకా ఒక్క టెస్ట్‌ కూడా ఆడలేదు.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 601/5 డిక్లేర్డ్‌

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 275

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (ఎల్బీ) ఇషాంత్‌ 0, ఎల్గర్‌ (సి) ఉమేష్‌ (బి) అశ్విన్‌ 48, డిబ్రుయిన్‌ (సి) సాహా (బి) ఉమేష్‌ 8, డుప్లెసి (సి) సాహా (బి) అశ్విన్‌ 5, బవుమా (సి) రహానె (బి) జడేజా 38, డికాక్‌ (బి) జడేజా 5, ముత్తుసామి (సి) రోహిత్‌ (బి) షమి 9, ఫిలాండర్‌ (సి) సాహా (బి) ఉమేష్‌ 37, కేశవ్‌ మహరాజ్‌ (ఎల్బీ) జడేజా 22, రబాడ (సి) రోహిత్‌ (బి) ఉమేష్‌ 4, నోర్చ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 13, మొత్తం (67.2 ఓవర్లలో) 189, వికెట్లపతనం: 1/0, 2/21, 3/70, 4/71, 5/79, 6/125, 7/129, 8/185, 9/189, 10/189, బౌలింగ్‌: ఇషాంత్‌ 5-2-17-1, ఉమేష్‌ యాదవ్‌ 8-3-22-3, షమి 9-2-34-1, అశ్విన్‌ 21-6-45-2, జడేజా 21.2-4-52-3, రోహిత్‌ శర్మ 2-0-4-0, కోహ్లీ 1-0-4-0

3

వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటై ‘పెయిర్‌’ సాధించిన మూడో సౌతాఫ్రికా ఓపెనర్‌ మార్‌క్రమ్‌. గ్యారీ కిర్‌స్టెన్‌, హెర్షెల్‌ గిబ్స్‌ ముందున్నారు.

8

విరాట్‌ సారథ్యంలో టెస్ట్‌ల్లో భారత్‌ సాధించిన ఇన్నింగ్స్‌ విజయాల సంఖ్య. అజర్‌ కెప్టెన్సీలోనూ భారత్‌ ఇన్నే ఇన్నింగ్స్‌ విజయాలు సాధించింది.

6

విదేశాల్లో దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా ఆరో పరాజయం.

డబుల్‌ సెంచరీ సాధించాలని ప్రణాళిక ప్రకారం క్రీజ్‌లోకి వెళ్లినంతమాత్రాన దాన్ని సాధించలేం. అలాకాకుండా ఐదు సెషన్లపాటు బ్యాటింగ్‌ చేయాలని వెళ్తే మాత్రం ‘డబుల్‌’ దానంతటదే వచ్చేస్తుంది.

- ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కోహ్లీ

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN