క్రికెట్‌ అకాడమీపై చర్చ

Prajasakti

Prajasakti

Author 2019-10-31 04:42:00

img

- బెంగుళూరులో సమావేశమైన గంగూలీ, ద్రావిడ్‌
- విరాట్‌కు కృతజ్ఞతలు తెలిపిన సౌరవ్‌
- రూ.50లకే ఈడెన్‌ టికెట్‌ ధర
బెంగళూరు : భారత క్రికెట్‌ నియంత్రణమండలి(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సిఏ) చీఫ్‌ రాహుల్‌ ద్రావిడ్‌తో సమావేశమయ్యారు. బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో బుధవారం సమావేశమైన వీరు క్రికెట్‌ అకాడమీ ఏర్పాటుతోపాటు అభివృద్ధి ప్రణాళికలపై చర్చలు చేశారు. జాతీయస్థాయిలో కొత్తగా నిర్మించాల్సిన జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సిఏ)లు, వాటి అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సుదీర్ఘ చర్చలు జరిపారు. జాతీయ క్రికెట్‌ అకాడమీని మరోస్థాయికి తీసుకెళ్ళేందుకు రూపొందించిన భవిష్యత్‌ ప్రణాళికను గంగూలీ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎన్‌సిఏలోని ఇతర అధికారులూ పాల్గొన్నారు.
సమావేశం తర్వాత కలిసి నగరంలో కొత్తగా ఎన్‌సిఏను నిర్మించాల్సిన స్థలాన్ని పరిశీలించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రక్కన అకాడమీ కోసం కర్ణాటక ప్రభుత్వం నుంచి బిసిసిఐ మరో 15 ఎకరాల భూమిని సేకరించింది. ఈ ఏడాది మే నెలలో 26 ఎకరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఎన్‌సిఏకు 40 ఎకరాల స్థలం ఉంది. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో అధునాతన సౌకర్యాలతో ఎన్‌సిఏను నిర్మించాలని బిసిసిఐ భావిస్తోంది. ఎన్‌సిఏ చీఫ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ జులైలోనుంచి బాధ్యతలో కొనసాగుతుండగా బిసిసిఐ అధ్యక్షునిగా సౌరవ్‌ గంగూలీ అక్టోబర్‌ 23న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బిసిసిఐ అధ్యక్షునిగా గంగలీ ఎన్నికైన తర్వాత ఎన్‌ఏసి సభ్యులతో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి ఎన్‌సిఏ సిఇవో తుపాన్‌ ఘోష్‌తోపాటు బిసిసిఐకు నూతనంగా ఎన్నికైన టెక్నికల్‌ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు.
కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపిన గంగూలీ
గతంలో ఆస్ట్రేలియాలో డే-నైట్‌ టెస్ట్‌ ఆడేందుకు నిరాకరించిన భారత్‌ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. టెస్టుల్లో నంబర్‌ వన్‌ జట్టైన టీమిండియా ఇప్పటివరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐదు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌ ఆడలేదు. భారత్‌-బంగ్లాదేశ్‌ మినహా అన్ని టెస్టు జట్లు డే-నైట్‌ టెస్టులు ఆడాయి. పలు కారణాలు చూపుతూ డే-నైట్‌ టెస్టులు ఆడేందుకు బిసిసిఐ అంగీకరించలేదు. అయితే సౌరవ్‌ గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. డే నైట్‌ టెస్టులు ఆడాల్సిందేనని పట్టుపట్టాడు. అంతేకాకుండా తన ఆలోచనలు కార్యరూపం దాల్చేలా వడివడిగా అడుగులు వేశాడు. మొదట కోహ్లీని ఒప్పించిన దాదా అనంతరం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును కూడా అంగీకరించేలా చేశాడు. తాజాగా డే-నైట్‌ టెస్టు కోసం గంగూలీ పంపిన ప్రతిపాదనలకు బిసిబి అంగీకారం తెలపడంతో టీమిండియా తొలి డే-నైట్‌ టెస్టుకు మార్గం సుగుమమైంది.
రూ.50లకే డే-నైట్‌ టెస్ట్‌ టికెట్‌
భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లమధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే చారిత్రాత్మక డే-నైట్‌ టెస్ట్‌ టికెట్‌ కనీస ధరను రూ.50లుగా బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(క్యాబ్‌) నిర్ణయించింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో 68వేల మంది సీట్ల సామర్థ్యమున్నా... ఎక్కువమందిని స్టేడియానికి రప్పించాలనే ఉద్దేశ్యంతో టికెట్‌ కనీస ధరను తగ్గించినట్లు క్యాబ్‌ కార్యదర్శి అభిషేక్‌ ధాల్మియా తెలిపారు. రోజువారీ టికెట్ల ధరను రూ.50, 100, 150గా నిర్ణయించామని.. రాత్రిపూట మంచు ప్రభావం నేపథ్యంలో మ్యాచ్‌ను మధ్యాహ్నం 2.30 గం||ల నుంచి 8.30 గం||లలోపు మ్యాచ్‌ ముగిసేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN