క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను

Mana Telangana

Mana Telangana

Author 2019-10-19 02:55:43

img

సౌతాఫ్రికాకు సవాల్, నేటి నుంచి రాంచీలో చివరి టెస్టు

రాంచీ : ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టింది. దక్షిణాఫ్రికాతో శనివారం ప్రారంభమయ్యే మూడో, ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్ కోహ్లి సేన ఇప్పటికే 20తో సొంతం చేసుకుది. ఇక, రాంచీలో జరిగే ఆఖరి మ్యాచ్‌లో కూడా గెలిచి చరిత్ర సృష్టించాలనే లక్షంతో కనిపిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికాకు ఈ సిరీస్ సవాలుగా మారింది. ఇందులో గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. కానీ, స్టార్ ఆటగాడు ఐడెన్ మార్‌క్రామ్ దూరం కావడం జట్టు కష్టాలను మరింత పెంచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న భారత్‌ను ఓడించాలనే సౌతాఫ్రికా అసాధారణ ఆటను కనబరచక తప్పదు.

కాగా, ఈ మ్యాచ్‌లో కూడా భారత్ గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇందులో కూడా గెలిచి సఫారీపై చారిత్రక విజయాన్ని అందుకోవాలని తహతహలాడుతోంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ జోరుమీదుండడంతో ఈ మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు అసాధ్యమేమి కాదనే చెప్పాలి. కాగా, ఈ మ్యాచ్‌కు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని సొంత నగరం రాంచీలో జరుగుతున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాలని భావిస్తోంది. తమ ఆరాధ్య క్రికెటర్ రానుండడంతో అభిమానులు కూడా భారీ సంఖ్యలో మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్నారు. దీంతో జార్ఖండ్ క్రికెట్ సంఘం స్టేడియం కిక్కిరిసి పోవడం ఖాయం.

ఓపెనర్లే కీలకం
ఇక, ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు కీలకంగా మారారు. ఇప్పటికే రెండేసి సెంచరీలతో కదంతొక్కిన ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు మరోసారి చెలరేగేందుకు సిద్ధమయ్యారు. తొలి టెస్టులో మయాంక్ ఏకంగా డబుల్ సెంచరీతో ప్రకంపనలు సృష్టించాడు. మరోవైపు రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌లలో శతకాలు సాధించి తానెంటో నిరూపించాడు. అయితే పుణెలో రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.

కానీ, మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించి జోరుమీదున్న మయాంక్ జార్ఖండ్‌లోనూ చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఇటు రోహిత్, అటు మయాంక్ సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. ఇద్దరు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే భారత్‌కు మరోసారి శుభారంభం ఖాయం. కాగా, రానున్న బంగ్లాదేశ్ సిరీస్ నేపథ్యంలో రోహిత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో రాణించడం ద్వారా ఓపెనర్‌గా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు.

కోహ్లి దూకుడు సాగాలి
మరోవైపు పుణె టెస్టులో అజేయ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌నే ఆడాలని భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించి టెస్టుల్లో తిరిగి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవాలని తహతహలాడుతున్నాడు. కొంతకాలంగా ఫార్మాట్ ఏదైనా కోహ్లి పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్, విండీస్ సిరీస్‌లలో పరుగుల సునామీ సృష్టించాడు. తాజాగా పుణె మ్యాచ్‌లో డబుల్ శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. కోహ్లి చెలరేగితే సౌతాఫ్రికా బౌలర్లకు మరోసారి కష్టాలు తప్పక పోవచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు కష్టం కాదు.

గాడిలో పడ్డారు
ఇదిలావుండగా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు గాడిలో పడడం కూడా భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న పుజారా ఈ సిరీస్‌లో వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించి సత్తా చాటాడు. అతను ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభసూచకమేనని చెప్పక తప్పదు. రహానె కూడా జోరుమీదున్నాడు. అతను కూడా ఫామ్‌లో కనిపిస్తున్నాడు. రవీంద్ర జడేజా, కీపర్ సాహాలు కూడా పర్వాలేదనిపిస్తున్నారు. జడేజా ఇటు బంతితో అటు బ్యాట్‌తో కూడా ఆకట్టుకుంటున్నాడు. అతని ఆల్‌రౌండ్‌షో జట్టుకు చాలా కీలకంగా మారింది. అశ్విన్ కూడా జోరుమీదున్నాడు.

జోరుమీదున్నారు..
సిరీస్‌లో భారత బౌలర్లు అసాధారణంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా అశ్విన్, జడేజాలు అద్భుత బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. సొంత గడ్డపై తమకు ఎదురులేదనే విషయాన్ని ఇద్దరు మరోసారి నిరూపించారు. అశ్విన్ ఇప్పటికే 14 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. జడేజా కూడా పది వికెట్లతో తానెంత ప్రమాదకర బౌలరో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు రుచి చూపించాడు. స్పీడ్‌స్టర్లు షమి, ఉమేశ్, ఇషాంత్‌లు కూడా అడపాదడపా వికెట్లు తీస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు. ఇటు స్పిన్నర్లు, అటు ఫాస్ట్ బౌలర్లు జోరుమీదుండడంతో సౌతాఫ్రికాకు ఈసారి కూడా కష్టాలు తప్పక పోవచ్చు.

తేలికకాదు..
కాగా, ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికాకు మూడో మ్యాచ్‌లో గెలవడం అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా విఫలమవుతోంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ జట్టుకు అండగా నిలువలేక పోతున్నారు. ఒకరిద్దరూ మాత్రమే జట్టుకు అండగా నిలుస్తున్నారు. భారత బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో బౌలర్లు విఫలమవుతున్నారు.

ఇక, బ్యాట్స్‌మెన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో రెండు మ్యాచుల్లో కూడా సఫారీలకు ఓటమి తప్పలేదు. కనీసం ఆఖరి మ్యాచ్‌లో నైనా గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ను ఓడించడం సౌతాఫ్రికాకు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. కానీ, సఫారీలు మాత్రం తమను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు.

జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి/ఉమేశ్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్, షమి.

దక్షిణాఫ్రికా: డుప్లెసిస్ (కెప్టెన్), డీన్ ఎల్గర్, బ్రూన్, బవుమా, డికాక్, జుబేర్ హంజా, ఫిలాండర్, కేశవ్ మహారాజ్, రబడా, ఎంగిడి, డేన్ పీడ్‌ట్, క్లాసెన్, నోర్ట్‌జే, ముత్తుస్వామి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD