చిత్తూరు జిల్లాలో భర్తీకాని సచివాలయ పోస్టులు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-13 10:25:30

చిత్తూరు, అక్టోబర్ 12: జిల్లాలో సచివాలయ పోస్టులు అధిక సంఖ్యలో భర్తీకి నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా 1035 గ్రామ సచివాలయాలు, 273 వార్డు సచివాలయాలను అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాలకు సంబంధించి 13 కేటగిరీల్లో 9770 పోస్టులు, వార్డు సచివాలయాల్లో ఆరు కేటగిరీల్లో 1730 పోస్టులు మొత్తం 11,500 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. వీటికోసం సుమారు 1.88లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇందులో సుమారు 8200మంది అర్హత సాధించగా వారిలో 5,563మంది సర్ట్ఫికెట్లను పరిశీలించి ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టారు. కానీ ఇందులోనూ చాలామంది గైర్హాజరయ్యారు. ఈనెల రెండవతేదీన జిల్లాలో అనేక గ్రామ సచివాలయాలను అధికారులు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలువురికి నియామక పత్రాలు అందజేశారు. అయితే కొన్ని కేటగిరీలకు చెందిన పోస్టు భర్తీల వ్యవహారం అస్థవ్యస్తంగా మారడంతో కొందరికి నియామక పత్రాలను అందజేసిన అధికారులు ఆ తరువాత వాటిని రద్దు చేశారు. అలాగే ఈ ఉద్యోగాలపై స్పష్టత లేకపోవడం, ఎంపికైన అభ్యర్థులకు కొన్ని నిబంధనలు పెట్టడంతో చాలామంది ఈ పోస్టుల్లో చేరడానికి అసక్తి చూపటంలేదు. ఇటీవల ఎంపికైన అభ్యర్థులకు శాఖల వారిగా పోస్టింగ్‌లకు కోసం అభ్యర్థుల నుంచి అప్షన్లు తీసుకున్నారు. ప్రభుత్వం మాత్రం అభ్యర్థులకు వారి సొంత మండలంలోనే సొంత గ్రామం, వార్డు మినహాయించి మిగిలిన సచివాలయాల్లో పోస్టింగ్ ఇవ్వాలని సూచించినా జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. జిల్లావ్యాప్తంగా అనేక కేటగిరీల్లో పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంవతో అధికారులు ప్రాధాన్యతపరంగా అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. దీనివల్ల అనేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులు తమ సొంతమండలాల్లో విధులు నిర్వహించే అవకాశాన్ని కోల్పోవలసి వచ్చింది. దీనిపై చాలామంది అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా పలువురు విధుల్లో చేరుతారా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన మండలాల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంతమంది విధుల్లో చేరుతారన్నది తేలాల్సి ఉంది. మరోపక్క వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి వార్డు సంక్షేమం, అభివృద్ధి కార్యదర్శులగా ఎంపికైన పలువురిపై అనర్హత వేటుపడింది. అలాగే అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు పోస్టులకు సంబంధించి వెయిటేజి మార్కుల వ్యవహారం కొంత గందరగోళ పరిస్థితికి కారణమైంది. ఇందు లో రాత పరీక్షలో అర్హత సాధించినా కొందరికి వెయిటేజీ మార్కులు కలపలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని కొందరు అభ్యర్థులు అధికారులు దృష్టికి తీసుకోచ్చారు. వార్టు సచివాలయాలకు సంబంధించి సంక్షేమం, అభివృద్ధి కార్యదర్శుల పోస్టులకు కొందరు బీకాం డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి సర్ట్ఫికెట్ల పరిశీలన పూర్తిచేసి నియామక పత్రాలను అందచేశారు. ఇంతలోనే ఈ పోస్టులకు బీఏ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులని ఆదేశాలు రావడం తో జిల్లావ్యాప్తంగా ఈ పోస్టులకు అర్హత సాధించిన బీకాం డిగ్రీకి చెందిన 41మందిపై అనర్హత వేటు వేశారు. దీంతో ఈ పోస్టులు కూడా ఖాళీగానే మిగిలిపోయాయి. జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన విధంగా అభ్యర్థులు అర్హత సాధించక పోవ డం, మరోపక్క ఉద్యోగాలకు ఎంపికైనవారు పలుకారణాలతో విధుల్లో చేరడానికి ఆసక్తి చూపకపోవడం తో జిల్లావ్యాప్తంగా సుమారు 5500 పోస్టులు భర్తీకి నోచుకోలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.
నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు మరో రెండురోజుల్లో తమకు కేటాయించిన సచివాలయాల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగిసిన తరవాత ఎంతమంది విధుల్లో చేరారు.. ఎన్ని పోస్టులు ఖాళీగా మిగిలాయనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదటి దశలో వివిధ కేటగిరీల్లో అర్హులు లేకపోవడంతో అనేక పోస్టులు భర్తీకి నోచుకోలేని కారణంగా ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గించి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో మరికొందరికి ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం ఉంది. ఈ వ్యవహరంపై అధికారులు కసరత్తు చేపట్టారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తరువాత అధికారులు ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. ఈ వ్యవహారాలు అన్ని పూర్తయిన తరువాత జిల్లాలో ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి, ఎన్ని మిగిలి పోయాయనేది తెలిసే అవకాశం ఉంది. మిగిలిన పోస్టులను ఎలా భర్తీ చేస్తారన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN