చిదంబరానికి ‘నో’ బెయిల్

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-01 03:05:19

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. సీనియర్ నేత చిదంబరానికి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. జాతీయ దర్యాప్తు సంస్థ వాదనలతో ఏకీభివించిన న్యాయమూర్తి సురేష్ కైట్ కాంగ్రెస్ నేత బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. 74 ఏళ్ల చిదంబరం కేంద్ర హోం, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత తీహార్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసు విచారణ పురోగతిన ఉన్న పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరఫున్యాయవాది హైకోర్టులో వాదించారు. బెయిల్‌పై బయటకు వస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని ఆరోపించారు. సీబీఐ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది అమిత్ మహాజన్ వాదనలు వినిపించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చిదంబరం తన కేసును తానే వాదించుంకుంటానని గతంలో కోరినా న్యాయస్థానం అంగీకరించలేదు. కాగా తమ క్లయింట్ సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రసక్తేలేదని చిదంబరం తరఫు న్యాయవాది అర్శదీపే సింగ్
చెప్పారు. ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ కోరింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. అదే ఏడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. చిదంబరం అక్టోబర్ 3వరకూ తీహార్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉంటారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN