చివరి టీ20లో టీమ్‌ఇండియా ఓటమి

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-23 05:16:00

-బ్యాట్స్‌మెన్ బాధ్యతారాహిత్యంతో సిరీస్ డ్రా ..
-విజృంభించిన డికాక్.. మెరిసిన బ్యూరన్ హెండ్రిక్స్
టీమ్‌ఇండియాను ముంచాలన్నా.. తేల్చాలన్నా ముందు ముగ్గురే అనేది మరోసారి రుజువైంది. టాప్ త్రీ బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌చేస్తే.. భారత్‌ను నిలువరించడం అత్యంత సులువని దక్షిణాఫ్రికా బౌలర్లు నిరూపించారు. శిఖర్ ధవన్ ఫర్వాలేదనిపించినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా పెవిలియన్ చేరగా.. రాక రాక వచ్చిన అవకాశాన్ని మిడిలార్డర్ చేజేతులా చెడగొట్టుకుంది. మ్యాచ్‌కు ముందు విరాట్ మాట్లాడుతూ.. జట్టు క్లిష్ట పరిస్థితిలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో పరీక్షించాలనుకుంటున్నాం. మా ఆటగాళ్లు కంఫర్ట్‌జోన్ నుంచి బయటకొచ్చేందుకు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాంఅని అన్నాడు. అందుకు తగ్గట్లే టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో మిడిలార్డర్‌కు పరీక్ష ఎదురైంది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇన్నింగ్స్‌కు నిలకడ తెచ్చే ధోనీలాంటి ఆటగాడు లేకపోవడంతో కుర్రాళ్లు చిత్తయ్యారు. పంత్, అయ్యర్, హార్దిక్, కృనాల్ ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
img

సంధి దశలో జట్టు పగ్గాలు చేతబట్టిన క్వింటన్ డికాక్ సూపర్ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. గత మ్యాచ్‌లోనూ అర్ధశతకం సాధించినా.. అది జట్టును గెలిపించలేకపోవడంతో ఈ సారి మరింత కసితో ఆడిన డికాక్.. చిన్నస్వామి స్టేడియంలో చెడుగుడాడుకున్నాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో లక్ష్యం మరిత చిన్నదైంది. క్వింటన్ విజృంభిస్తుంటే.. చూస్తూ ఉండటం తప్ప భారత బౌలర్లు చేయగలిగిందేమి లేకపోయింది. ఈ విజయంతో సిరీస్‌ను డ్రాచేసుకున్న సఫారీలు టెస్టు సమరం ప్రారంభానికి ముందు అవసరమైన ఆత్మవిశ్వాసం మూటగట్టుకున్నారు.

బెంగళూరు: కొత్త కెప్టెన్ క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో విజృంభించడంతో.. భారత్‌తో జరిగిన చివరి టీ20లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా.. రెండోదాంట్లో టీమ్‌ఇండియా గెలుపొందింది. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉండటంతో.. టాస్ గెలిచిన కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే బ్యాట్స్‌మెన్ సమిష్టి వైఫల్యంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులే చేసింది. శిఖర్ ధవన్ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో రబాడ (3/39), బ్యూరన్ హెండ్రిక్స్ (2/14), ఫార్చూన్ (2/19) ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో సారథితో పాటు రిజా హెండ్రిక్స్ (28; 4 ఫోర్లు), బవుమా (27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 140 పరుగులు చేసి గెలిచింది. బ్యూరన్ హెండ్రిక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

రాక రాక చాన్స్‌వస్తే..

మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు ఈ మ్యాచ్‌లోనూ శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్‌లో మాదిరిగానే రెండు చక్కటి బౌండ్రీలతో ఆకట్టుకున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (9) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. లెఫ్టార్మ్ పేసర్ బ్యూరన్ హెండ్రిక్స్ బంతిని కట్ చేసే ప్రయత్నంలో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే మొహాలీని మరిపిస్తూ ధవన్, కోహ్లీ (9) క్రీజులో నిలువడంతో భారీ స్కోరు ఖాయమే అనిపించింది. అందుకు తగ్గట్లే.. శిఖర్ రెచ్చిపోయాడు. ఫెలుక్వాయో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన అతడు.. షంసీ ఓవర్‌లో వరుస సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అదే జోరులో భారీ షాట్‌కు యత్నించిన ధవన్ క్యాచ్ ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టే క్రమంలో బౌండ్రీ వద్ద ఫెలుక్వాయో పట్టిన చక్కటి క్యాచ్‌కు కోహ్లీ డగౌట్ బాట పట్టడంతో టీమ్‌ఇండియా 68/3తో కష్టాల్లో పడింది. ఇలాంటి సందర్భంలోనే మిడిలార్డర్ సత్తా బయట పడుతుందనకుంటే.. అందుకు భిన్నంగా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తీవ్ర ఒత్తిడి మధ్య నాలుగో స్థానంలో క్రీజులోకిచ్చిన రిషబ్ పంత్ (19; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు నిలిచినా భారీ స్కోరు చేయలేకపోయాడు. కుదురుకునేందుకు సమయం తీసుకున్న పంత్ మరోసారి నిర్లక్ష్యపు షాట్ ఆడి ఔటయ్యాడు. 5.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ చేరిన భారత్.. 16వ ఓవర్లో గానీ 100 రన్స్ చేయలేకపోయింది. ఆదుకుంటాడనుకున్న శ్రేయస్ అయ్యర్ (5) అనూహ్యంగా స్టంపౌడయ్యాడు. పాండ్యా బ్రదర్స్ అయినా ఆకట్టుకుంటారేమో అనుకుంటే.. అదీ సాధ్యం కాలేదు. కృనాల్ 4 పరుగులే చేసి ఔట్ కాగా.. హార్దిక్ (14) ఏడు ఓవర్లకు పైగా క్రీజులో ఉన్నా మునుపటి మెరుపులు మెరిపించలేకపోయాడు. ఆఖర్లో జడేజా (19; 1 ఫోర్, 1 సిక్స్) కాస్తలో కాస్త మెరుగ్గా ఆడటంతో టీమ్‌ఇండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

డికాక్ దూకుడు

ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో డికాక్ దుమ్మురేపడంతో ఆ జట్టు ఎక్కడా ఇబ్బంది పడలేదు. కెప్టెన్‌తో పాటు రిజా హెండ్రిక్స్, బవుమా సత్తాచాటడంతో ఆ జట్టు మరో 19 బంతులు మిగిలుండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది. గత మ్యాచ్‌లో అర్ధశతకం సాధించినా జట్టును గెలిపించలేకపోయిన డికాక్ ఈ మ్యాచ్‌లో కడదాకా నిలిచి చక్కటి విజయాన్నందించాడు. సుందర్, దీపక్ ఓవర్లలో ఒక్కో ఫోర్‌తో జోరు ప్రారంభించిన డికాక్.. సైనీకి రెండు సిక్సర్లు రుచి చూపించాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి దక్షిణాఫ్రికా 43/0తో నిలిచింది. ఆ తర్వాత సుందర్ బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదిన డికాక్ 38 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించాక హెండ్రిక్స్ ఔటైనా.. సారథికి బవుమా చక్కటి సహకారం అందించాడు. తొలి బంతికే వికెట్ తీసి ఆశలు రేపిన హర్దిక్‌కు డికాక్ చుక్కలు చూపాడు. హార్దిక్ తొలి ఓవర్‌లో 2 ఫోర్లు బాదిన క్వింటన్.. తదుపరి ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. కృనాల్ ఓవర్‌లోనూ 4,6 అరుసుకొని డికాక్ లక్ష్యాన్ని తగ్గించగా.. బవుమా సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
img

ప్రపంచకప్ ముందు ప్రయోగాలు చేస్తాం (ఫ్లాట్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంపై). పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలను మార్చేలా మైండ్‌సెట్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో మా వ్యూహాలను పక్కాగా అమలు చేయలేకపోయాం. ఇలాంటి మ్యాచ్‌లూ ఉంటాయి. దక్షిణాఫ్రికా బాగా బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు పిచ్ సహకరించింది. ఆట గతిని మేం అర్థం చేసుకోలేకపోయాం. వన్డేల్లో బౌలర్లు పుంజుకునేందుకు సమయం ఉంటుంది. కానీ టీ20ల్లో ప్రత్యర్థి జట్టు చేసే 40-50 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను చేజారుస్తుంది.
- కెప్టెన్ విరాట్ కోహ్లీ

-టీమ్‌ఇండియా తరఫున అత్యధిక టీ20లు ఆడిన ధోనీ(98) రికార్డును ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో సమం చేశాడు. తర్వాతి స్థానంలో సురేశ్ రైనా(78) ఉన్నాడు.

స్కోరు బోర్డు

భారత్: ధవన్ (సి) బవుమా (బి) షంసీ 36, రోహిత్ (సి) రిజా హెండ్రిక్స్ (బి) బ్యూరన్ హెండ్రిక్స్ 9, కోహ్లీ (సి) ఫెలుక్వాయో (బి) రబాడ 9, పంత్ (సి) ఫెలుక్వాయో (బి) ఫార్చూన్ 19, శ్రేయస్ (స్టంప్డ్) డికాక్ (బి) ఫార్చూన్ 5, హార్దిక్ (సి) మిల్లర్ (బి) రబాడ 14, కృనాల్ (సి) డికాక్ (బి) బ్యూరన్ హెండ్రిక్స్ 4, జడేజా (సి అండ్ బి) రబాడ 19, సుందర్ (రనౌట్) 4, దీపక్ (నాటౌట్) 0, సైనీ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం: 20 ఓవర్లలో 134/9. వికెట్ల పతనం: 1-22, 2-63, 3-68, 4-90, 5-92, 6-98, 7-127, 8-133, 9-133, బౌలింగ్: ఫార్చూన్ 3-0-19-2, రబాడ 4-0-39-3, బ్యూరన్ హెండ్రిక్స్ 4-0-14-2, ఫెలుక్వాయో 4-0-28-0, షంసీ 4-0-23-1, ప్రిటోరియస్ 1-0-8-0.
దక్షిణాఫ్రికా: రిజా హెండ్రిక్స్ (సి) కోహ్లీ (బి) హార్దిక్ 28, డికాక్ (నాటౌట్) 79, బవుమా (నాటౌట్) 27, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 16.5 ఓవర్లలో 140/1. వికెట్ల పతనం: 1-76, బౌలింగ్: సుందర్ 4-0-27-0, దీపక్ 3-0-15-0, సైనీ 2-0-25-0, కృనాల్ 3.5-40-0, హార్దిక్ 2-0-23-1, జడేజా 2-0-8-0.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN