జీవితాంతం రుణపడి ఉంటాం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-01 05:06:57

img

విజయవాడ, సెప్టెంబర్ 30: అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే లక్షన్నర ఉద్యోగాలు కల్పించడం చారిత్రాత్మకమని కొత్తగా ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. స్థానిక మొగల్రాజపురంలోని కనె్వన్షన్ హాలులో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేతులు మీదుగా, గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగ నియామకపత్రాలను అందుకున్న సందర్భంగా సంబంధిత ఉద్యోగులు తమ మనోభావాలను వ్యక్తపరిచారు. తక్కువ సమయంలో లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. గ్రామ మత్స్యశాఖ అసిస్టెంట్ ఉద్యోగం పొందిన గంపలగూడెం గ్రామానికి చెందిన సగ్గూర్తి ముత్యాలు మాట్లాడుతూ తన తల్లి సుజాత డయాలసిస్ వ్యాధిగ్రస్తులు అని, తండ్రి లక్ష్మీనారాయణ కార్మికుడు అని, ఆయన మీదే కుటుంబం మొత్తం ఆధారపడి ఉందన్నారు. తన తల్లి డయాలసిస్‌కు గతంలో ఎంతో డబ్బు ఖర్చు చేశామని అయితే సీఎం జగన్మోహనరెడ్డి డయాలసిస్ పేషెంట్‌కు నెలకు పదివేల రూపాయలు ఇవ్వడంతో ఎంతో ఊరట చెందామన్నారు. తనకు సచివాలయ ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, అదీ తమ కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ ఉద్యోగం లభించినందుకు సీఎం జగన్మోహనరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగం పొందిన అబ్దుల్ ఖలీద్ మాట్లాడుతూ ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల చదువుకున్నామని ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తమకు ఉద్యోగాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తామని సీఎం జగన్మోహనరెడ్డి చెప్పిన మాటకు ఇదే నిదర్శనం అన్నారు. అయితే తమలాంటి నిరుద్యోగులకు మరింత మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మరోపెద్ద ఉద్యోగ నియామక నోటిఫికేషన్ వస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఎఎన్‌ఎంగా ఎంపికైన పి రేవతి మాట్లాడుతూ తన భర్త ఆటోడ్రైవర్ అని తాను ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నన్నారు. జీవితంలో ఉద్యోగం వస్తుందనే ఆశ కోల్పోయానని ఆ తరుణంలో ఈ ఉద్యోగం పొందడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగం పొందిన ఆర్ పూజితారత్నం మాట్లాడుతూ తమ గ్రామంలో హైస్కూల్ కూడా లేదని, దూర ప్రాంతం వెళ్లి చెదువుకునేవాళ్లమన్నారు. పది ఎకరాలు ఉన్న ఆసామి కన్నా పదవ తరగతి చదివిన వ్యక్తే గొప్ప అని తన తండ్రి చెప్పేవారని, ఆ మాట నేడు తాను ఉద్యోగం పొందిన సమయంలో నిజమని నిరూపమైందన్నారు. వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ అసిస్టెంట్ ఉద్యోగం పొందిన డి జయశ్రీ మాట్లాడుతూ తాను బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి గత మూడు సంవత్సరాలుగా ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసానని ఈ సమయంలో తమ బంధువులు కూడా హేళన చేసేవారన్నారు. అయితే సీఎం జగన్మోహనరెడ్డి చేపట్టిన అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌లో తాను ఉద్యోగం పొందడం అదృష్టంగా భావిస్తునన్నారు. నోటిఫికేషన్లు మరిన్ని వచ్చి నిరుద్యోగులకు అండగా ఉండాలన్నారు. మహిళా పోలీస్ ఉద్యోగానికి ఎంపికైన కైసర్ పర్వీన్ మాట్లాడుతూ 2018లో బిటెక్ పూర్తి చేసానని తన తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారని తనకు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక ఉండేదన్నారు. తనకన్నా మెరిట్ స్టూడెంట్స్ ఎంతోమంది ఉద్యోగాలు పొందలేకపోవడంపై తనలో కూడా నిరుత్సాహం ఉండేదని అయితే ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా తాను ఉద్యోగం పొందడమే కాకుండా సీఎం చేతులు మీదుగా నియామకపత్రాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అసిస్టెంట్ ఉద్యోగం పొందిన ఆర్ వెంకటలక్ష్మి, కె నాగకీర్తి, కె వౌనిక, హేమలత, ఎస్ రాము, వి లలితకుమార్, ఎంబీ షరీఫ్ అహ్మద్, ఎస్ చంటిబాబు, జి సమీరా, ఎం రాణిసుష్మా తదితరులు సీఎం తన కృతజ్ఞతలు తెలియజేశారు.
*చిత్రాలు..సచివాలయ ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
* ఉద్యోగుల జాబ్‌చార్ట్ విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్, మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, కొడాలి, పేర్ని నాని తదితరులు

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN