జైస్వాల్ డబుల్ ధమాకా
-పిన్న వయసు ప్లేయర్‌గా రికార్డు
బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాళ్ల మెరుపులు కొనసాగుతున్నాయి. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ డబుల్ సెంచరీ మరువకముందే.. ముంబై యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ (154 బంతుల్లో 203; 17 ఫోర్లు, 12 సిక్సర్లు) ఆ ఫీట్ రిపీట్ చేశాడు. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ 17 ఏండ్ల చిచ్చరపిడుగు చెలరేగిపోయాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయసు (17 ఏండ్ల 192 రోజులు)లో డబుల్ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. యశస్వీ దూకుడుతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 358 పరుగులు చేసింది. ఆదిత్య తారే (78) కూడా రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జార్ఖండ్ 46.4 ఓవర్లలో 319 పరుగులకు ఆలౌటైంది. 66 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జార్ఖండ్‌ను విరాట్ సింగ్ (100), సౌరభ్ తివారీ (77) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 171 పరుగులు జోడించడంతో ఒక దశలో జార్ఖండ్ విజయం సాధిస్తుందనిపించినా.. ముంబై పేసర్ ధవల్ కులకర్ణి (5/37) కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు.