టీమిండియా వాకిట తెలుగు కెరటం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-13 06:49:14

img

కోన శ్రీకర్‌ భరత్‌.. ఆంధ్ర రంజీ జట్టులో కీలక ఆటగాడు.. ట్రిపుల్‌ సెంచరీలతో పరుగుల వరద పారించిన విధ్వంసకర బ్యాట్స్‌మన్‌. కీపర్‌గా వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ క్యాచ్‌లు పట్టడమే కాకుండా రెప్పపాటులో ప్రత్యర్థులను స్టంపౌట్లతో పెవిలియన్‌ దారి పట్టించడంలో దిట్ట. ఇప్పటివరకు 69 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 3,909 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలున్నాయి. ఇక వికెట్‌ కీపర్‌గా అతని ఖాతాలో 233 క్యాచ్‌లు, 27 స్టంపౌట్స్‌ ఉండడం విశేషం. భారత-ఎ జట్టులో చోటు దక్కించుకుని దక్షిణాఫ్రికా-ఎ, వెస్టిండీస్‌-ఎ, శ్రీలంక-ఎ ఆస్ర్టేలియా-ఎ, ఇంగ్లండ్‌ లయన్స్‌ వంటి జట్లపై వరుసగా 12 అనధికార టెస్టు మ్యాచ్‌లు ఆడి 686 రన్స్‌ సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. అలాగే కీపర్‌గా 41 క్యాచ్‌లు పట్టి, ఆరు స్టంపౌట్‌లు చేసి సెలెక్షన్‌ కమిటీ నమ్మకాన్ని నిలబెట్టిన యువ క్రికెటర్‌ శ్రీకర్‌ భరత్‌.. ఒక దశలో టీమిండియా సీనియర్‌ జట్టు ఎంపికలో భరత్‌ పేరు ప్రస్తావనకు రావడం అతని ప్రతిభకు నిదర్శనం.

ఆంధ్రకు తొలి ట్రిపుల్‌ సెంచరీ

రంజీ ట్రోఫీలో ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి ఆంధ్ర ఆటగాడిగా భరత్‌ రికార్డుకె క్కాడు. 2014-15 సీజన్‌లో ఒంగోలులో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 308 రన్స్‌ చేశాడు. ఆ సీజన్‌లో 54.14 సగటుతో 758 రన్స్‌ సాధించాడు. ధాటిగా బ్యాటింగ్‌ చేయడానికే ప్రాధాన్యమివ్వడంతో తర్వాతి సీజన్‌లో ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో సీనియర్ల సలహా, సూచనలతో నిలకడగా ఆడుతూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

అసాధారణ క్యాచ్‌ల్లో దిట్ట

కీపర్‌గా వికెట్ల వెనుక వేగంగా కదులుతూ అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంలో దిట్టగా భరత్‌ గుర్తింపు పొందాడు. దేశంలోని ప్రస్తుత వికెట్‌ కీపర్లతో పోల్చితే అసాధారణ క్యాచ్‌లు పట్టడంలో భరత్‌ ముందుంటాడనడం అతిశయోక్తి కాదు. ఇప్పటిదాకా అతని ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 233 క్యాచ్‌లు పట్టడమే అందుకు తార్కాణం.

ఆత్మస్థయిర్యాన్ని కోల్పోలేదు..

ఇటీవల వెస్టిండీస్‌ టూర్‌కు భారత్‌ సీనియర్‌ జట్టు ఎంపిక సందర్భంగా సెలెక్షన్‌ కమిటీ సమావేశంలో భరత్‌ పేరు పరిశీలనకు వచ్చింది. అయితే కారణాలు ఏమైనా జట్టులో చోటు పొందలేకపోయాడు. వరల్డ్‌కప్‌నకు ముందు జరిగిన ఆస్ర్టేలియా టూర్‌కు కూడా టీమిండియాలో చోటుకు అతడి పేరు వినిపించింది. అయితే అతడి పేరు ప్రస్తావనకు వచ్చినా జాతీయజట్టులో స్థానం దక్కకపోవడంపై నిరుత్సాహపడలేదు, ఆత్మస్థయిర్యాన్ని కోల్పోలేదు. జట్టు ఎంపికలో సెలెక్షన్‌ కమిటీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందని సరిపెట్టుకున్నాడు. కానీ, ఏనాటికైనా టీమిండియాలో చోటు సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు.

ద్రావిడ్‌ ప్రోత్సాహం

భారత-ఎ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌.. భరత్‌ను ఎంతో ప్రోత్సహించాడు. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా కీపర్‌గానూ తనకున్న అనుభవంతో భరత్‌కు చాలా సలహాలు ఇచ్చి అతని ఆటలో అనూహ్య మార్పు తీసుకొచ్చాడు. అప్పటిదాకా ఓపెనర్‌గా ఆడే భరత్‌ను ఐదో నంబరు బ్యాట్స్‌మన్‌గా దించాడు. దీంతో భరత్‌ వరుసగా పెద్ద స్కోర్లు చేశాడు. భారత-ఎ జట్టులో భరత్‌ రాణించడం వెనుక ద్రావిడ్‌ ప్రభావం ఎంతో ఉందని చెప్పక తప్పదు.

ధోనీ సలహా కొత్త మార్పునిచ్చింది..

ఒత్తిడికి గురికాకుండా ఆటను ఎంజాయ్‌ చేస్తూ ఆడితే తప్పక రాణిస్తావంటూ ధోనీ ఇచ్చిన సలహా భరత్‌లో కొత్త మార్పుతెచ్చింది. ధోనీ సూచనతో ఉత్సాహంగా బరిలోకి దిగడంతో సునాయాసంగా పరుగులు సాధించాడు. అలాగే యువరాజ్‌ సింగ్‌ ఇచ్చిన సూచనలు అతడి బ్యాటింగ్‌లో మార్పు తీసుకొచ్చింది.

(విశాఖపట్నం స్పోర్ట్స్‌)

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN