టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తోన్నవిరాట్‌ సేన

Nava Telangana

Nava Telangana

Author 2019-10-18 04:17:16

రాంచీ: ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్‌లో పాయింట్ల పరంగా డబుల్‌ సెంచరీ కొట్టేసిన టీమిండియా.. సఫారీలతో చివరి టెస్టును కూడా గెలిస్తే ఆ పాయింట్ల సంఖ్యను 240కి పెంచుకుంటుంది. విశాఖలో సఫారీలతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించగా, పుణేలో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో మూడో టెస్టును కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని విరాట్‌ సేన భావిస్తోంది. కేవలం నాలుగు టెస్టులో మాత్రమే ఆడిన టీమిండియా ఆ నాలుగు టెస్టుల్లోనూ విజయాలను నమోదు చేసుకొని 200 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక న్యూజిలాండ్‌, శ్రీలంకజట్లు రెండేసి టెస్టుమ్యాచులు ఆడి 60 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉండగా... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌జట్లు ఐదు టెస్టులు ఆడి కేవలం 56 పాయింట్లతో ఆ తర్వాత స్థానాలో కొనసాగుతున్నాయి. మిగతా జట్లు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన దాఖలు లేవు. కోహ్లీ సేన నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. ఇందులోనూ క్లీన్‌స్వీప్‌ చేస్తే ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది.
ఆర్మీకి 5000 టిక్కెట్లు
ఆర్మీ జవాన్లు, సైనికులు, ఎన్‌సిసి క్యాడెట్లు ఉచితంగా చూసేందుకు 5000 టిక్కెట్లను ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం సమకూర్చనుంది. భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జార్ఖండ్‌ వేదికగా మూడో టెస్ట్‌ను ఇక్కడ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మైదానానికి టెస్ట్‌ హోదా పొందిన తర్వాత ఇక్కడ జరిగే రెండో టెస్ట్‌ మాత్రమే ఇది. దీంతో జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం(జెఎన్‌సిఏ) గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర సంఘం ఓ ప్రకటనలో 'సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు, సైనికులు, ఎన్‌సిసి క్యాడెట్ల కోసం 5వేల టిక్కెట్లు పక్కన పెట్టాం... అలాగే ఆయా జిల్లాల్లోని పాఠశాల విద్యార్థులకూ మేం టిక్కెట్లు పంచిపెట్టాం' అని జెఎన్‌సిఏ కార్యదర్శి సంజరు సహారు తెలిపారు. అలాగే ఇరుజట్ల ఆటగాళ్లకు వేర్వేరు హోటల్‌ గదులు కేటాయించడంలో తమ పాత్ర ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. రాంచీ స్టేడియానికి 13 కి.మీ. దూరంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు, 9 కి.మీ. దూరంలో కోహ్లీ సేనకు బస ఏర్పాటు చేశారు. రాంచీలో వైద్యుల సదస్సు జరుగుతుండడంతో వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని, అంతేగాక ఆ గదులను బుక్‌ చేసింది తమ రాష్ట్ర క్రికెట్‌ సంఘం కాదని, బిసిసిఐ అని సంజరు ఆ ప్రకటనలో తెలియజేశారు.
గాయంతో తప్పుకున్న మాక్రమ్‌
టెస్టు సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టు ఓపెనర్‌ మాక్రమ్‌ స్వీయ తప్పిదం కారణంగా చేతికి గాయం చేసుకుని సఫారీలకు షాకిచ్చాడు. రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌట్‌ కావడంతో నిరాశకు గురైన మాక్రమ్‌ ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నాడు. దాంతో శనివారం నుంచి రాంచీలో ఆరంభం కానున్న చివరి, మూడోటెస్టు నుంచి వైదొలిగాడు. మాక్రమ్‌ కుడిచేయి మణికట్టుకు గాయం కావడంతో అతను జట్టుకు దూరమవుతున్న విషయాన్ని దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. దాంతో మాక్రమ్‌ గురువారం స్వదేశానికి పయనమయ్యాడు. దీనిపై మాక్రమ్‌ మాట్లాడుతూ.. డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో నిరాశలో నా చేతికి గాయం చేసుకున్నా. నాకు గాయం కావడం కంటే కూడా క్లిష్ట పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టుకు దూరం కావడం ఎక్కువగా బాధిస్తుంది. నన్ను క్షమించండి' అని పేర్కొన్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN