డే అండ్ నైట్ టెస్ట్ ఆడుదాం.. బంగ్లాదేశ్‌ను కోరిన బీసీసీఐ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-28 22:59:52

img

ముంబై: కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టిన బీసీసీఐ టీమ్ భారత క్రికెట్‌లో వినూత్న మార్పులు తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలో భారత క్రికెట్‌లో పలు కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారత జట్టుని తొలిసారిగా డే అండ్ నైట్ టెస్ట్ ఆడించేందుకు పావులు ముందుకు కదుపుతోంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇరు జట్లు మూడు టీ-20లు, రెండు టెస్ట్ మ్యాచులు ఆడనున్నాయి. అయితే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌ని డే అండ్ నైట్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ప్రతిపాదన పంపించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. నవంబర్ 22 నుంచి 26వ తేదీ వరకూ ఈ మ్యాచ్ జరుగనుంది.

దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి అక్రమ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు డే అండ్ నైట్ టెస్ట్ ఆడుదామని ప్రతిపాదించారు. మూడు రోజుల క్రితం మాకు ఇందుకు సంబంధించిన ఉత్తరం అందింది. దీని గురించి చర్చించిన తర్వాత మా నిర్ణయాన్ని ప్రకటిస్తాము. మరో రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు.

ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీం ఇండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ.. దులీప్ ట్రోఫీలో పింక్ బాల్ వాడాలని సూచించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ డే అండ్ నైట్ క్రికెట్‌కు అంగీకరిస్తే.. టీం ఇండియా ఆడుతున్న తొలి డే అండ్ నైట్ టెస్ట్‌లోనూ పింక్ బాల్ ఉపయోగించే అవకాశం ఉంది. అంతేకాక.. టీం ఇండియా ఆడుతున్న తొలి డే అండ్ నైట్ టెస్ట్‌కు ఈడెన్ గార్డెన్స్ మొట్టమొదటి వేదిక కానుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD