డే-నైట్ టెస్ట్‌లకు కోహ్లీ ఓకే
- బిసిసిఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ
కోల్‌కతా : బంగ్లాదేశ్‌తో డే-నైట్ టెస్ట్‌లు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆమోదం తెలిపాడని బిసిసిఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ శుక్రవారం తెలిపారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను డే మ్యాచ్‌లుగా నిర్వహించడం వల్ల స్టేడియాలకు వచ్చి చూసే ప్రేక్షకులు కరువైన సంగతిని ఈ సందర్భంగా గంగూలీ గుర్తుచేశారు. అలాగే రాంచీ టెస్ట్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది కేవలం 1500మంది మాత్రమేనన్నారు. సౌరవ్ గంగూలీ అధ్యక్షతన గురువారం జరిగిన బిసిసిఐ సమావేశంలో నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్ట్‌లను డే-నైట్లుగా నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయం చర్చకు వచ్చిందన్నారు. వచ్చే నెల 14-18న ఇండోర్‌లో జరిగే తొలిటెస్ట్ను గానీ, 22-26న కోల్‌కతాలో జరిగే రెండోటెస్ట్ను గానీ డే-నైట్‌గా నిర్వహించడానికి ప్రయత్నిస్తు న్నామని, దీనికి నూతనంగా ఎన్నికైన బిసిసిఐ సభ్యులు, కెప్టెన్, ఉప కెప్టెన్ల అభిప్రాయాలను కూడా తీసుకున్నామన్నారు. ఇంకా ఈ సమావేశంలో బిసిసిఐ సభ్యులు, కెప్టెన్లు సుముఖత వ్యక్తం చేశారని,బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా సహరిస్తే భారత్‌లో తొలిసారి ప్రయోగాత్మకంగా డే-నైట్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.