తేలి పోయిన టీమిండియా

Mana Telangana

Mana Telangana

Author 2020-02-13 02:55:22

img

క్రీడా విభాగం: కొంత కాలంగా వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న టీమిండియాకు వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే సిరీస్‌లో భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. సొంత గడ్డపై భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కివీస్ 30తో వైట్‌వాష్ చేసింది. ట్వంటీ20 సిరీస్‌లో భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. అయితే టి20ల్లో అసాధారణ ఆటను కనబరిచిన టీమిండియా వన్డే సిరీస్‌కు వచ్చే సరికి తీవ్ర ఒత్తిడిలో కనిపించింది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తేలి పోయింది. బౌలర్ల వైఫల్యం జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పక తప్పదు.

కీలక బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా వైఫల్యం జట్టును వెంటాడింది. దీనికి తోడు పేలవమైన ఫీల్డింగ్ కూడా భారత్ పరాజయాల్లో కీలక పాత్ర పోషించిందని చెప్పక తప్పదు. మరోవైపు టి20 సిరీస్‌లో అంతంత మాత్రంగానే రాణించిన కివీస్ ఆటగాళ్లు వన్డేలకు వచ్చే సరికి అనూహ్యం పుంజుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు మార్టిన్ గుప్టిల్, రాస్ టైలర్, టిమ్ సౌథి తదితరులు అద్భుత ఆటతో కివీస్ విజయాల్లో ముఖ్య భూమిక పోషించారు. ఇక, భారత జట్టులో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇటీవల కాలంలో భారత్ సాధిస్తున్న విజయాల్లో రోహిత్‌దే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.

గాయం వల్ల రోహిత్ వన్డే సిరీస్ నుంచి వైదొలగడం భారత్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపించింది. అంతేగాక ధావన్ కూడా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో యువ ఆటగాళ్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ మ్యాచ్‌లో కూడీ ఈ జోడీ భారత్‌కు శుభారంభం అందించలేక పోయింది. పృథ్వీషా కాస్త రాణించినా మయాంక్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లోనూ నిరాశే మిగిల్చాడు. అందివచ్చిన అవకాశాన్ని వీరిద్దరూ సద్వినియోగం చేసుకోలేక పోయారనే చెప్పాలి.

రాహుల్, అయ్యర్‌లు మెరిసినా
మరోవైపు వన్డే సిరీస్‌లో లోకేశ్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు మాత్రమే నిలకడైన ఆటను కనబరిచారు. వీరిద్దరే జట్టుకు అండగా నిలిచారు. అంతేగాక ఇద్దరు కలిసి 400కి పైగా పరుగులు సాధించారు. ఇదే క్రమంలో రాహుల్, శ్రేయస్‌లు ఒక్కో సెంచరీ కూడా బాదేశారు. కానీ, మిగతావారు విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే చెప్పాలి. ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించే కోహ్లి ఈసారి విఫలమయ్యాడు. దీంతో జట్టుకు ప్రతికూల పరిస్థితి తప్పలేదు. మరోవైపు సారథిగా కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. ప్రతి సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించే కోహ్లి ఈసారి మాత్రం పెద్దగా ప్రబావం చూపలేక పోయాడు. కోహ్లి వైఫల్యం కూడా భారత్ ఓటమికి ఒక కారణంగా చెప్పక తప్పదు.

బౌలర్ల వైఫల్యం
ఇక, ఈ సిరీస్‌లో భారత ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. బుమ్రా, శార్దూల్, సైని వంటి ప్రతిభావంతులైన బౌలర్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా సీనియర్ బౌలర్ బుమ్రా ఈ సిరీస్‌లో అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచాడు. మూడు మ్యాచుల్లో కలిపి ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. దీన్ని బట్టి అతని బౌలింగ్ ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు. మూడు ఫార్మాట్‌లలో కూడా అద్భుత బౌలర్‌గా పేరు తెచ్చుకున్న బుమ్రా కివీస్‌పై మాత్రం తేలి పోయాడు. మూడు మ్యాచుల్లో కూడా విఫలమయ్యాడు. కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు అండగా నిలువడంలో బుమ్రా ఎప్పుడూ ముందుండే వాడు. కానీ, ఈసారి మాత్రం బుమ్రాలో ఆ జోష్ కనిపించలేదు. ఒక మ్యాచ్‌లో అయితే ఏకంగా 13 వైడ్లు వేసి అందరిని విస్మయానికి గురి చేశాడు.

అంతేగాక మూడు మ్యాచుల్లో కలిపి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక పోయాడు. ఇక, శార్దూల్ ఠాకూర్ కూడా ఘోరంగా విఫలమయ్యాడు. వికెట్లు తీయడం మాట అటుంచి భారీగా పరుగులు సమర్పించుకుని జట్టు ఓటముల్లో ముఖ్య భూమిక పోషించాడు. యువ బౌలర్ సైని కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇక, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా చెత్త బౌలింగ్‌తో నిరాశ పరిచాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేక పోయాడు. అతని వైఫల్యం కూడా జట్టును వెంటాడింది. అయితే రవీంద్ర జడేజా ఒక్కడే కాస్త మెరుగైన బౌలింగ్ కనబరిచాడు. ఇటు బ్యాట్‌తో అటు బంతితో జట్టుకు అండగా నిలిచాడు. కేదార్ జాదవ్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు.

చెత్త ఫీల్డింగ్
సిరీస్‌లో భారత ఫీల్డింగ్ అత్యంత చెత్తగా సాగిందని చెప్పాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్ జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న భారత్ ఈ సిరీస్‌లో మాత్రం పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. స్టార్ ఫీల్డర్లు సయితం చెత్త ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు భారీ పరుగులు సమర్పించుకున్నారు. చేతికి వచ్చిన సులువైన క్యాచ్‌లను సయితం నేలపాలు చేశారు. అంతేగాక బౌండరీలను అపడంలో విఫలమయ్యారు. ఒక్క జడేజా తప్ప మిగతవారు ఫీల్డింగ్‌లో తేలి పోయారు. వీరి వైఫల్యం కూడా కివీస్ విజయాలకు దోహదం చేసిందని చెప్పక తప్పదు. సులువైన క్యాచ్‌లను సయితం వదిలేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ప్రాణం పోశారు. చెత్త బౌలింగ్‌కు పేలవమైన ఫీల్డింగ్ కూడా తోడు కావడంతో భారత్‌కు కివీస్ చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. రానున్న సిరీస్‌లలో భారత్ ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగు పరుచు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఇలాంటి అవమానకర ఓటములు మరిన్ని ఎదురు కావడం ఖాయం.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN