తేలి పోయిన టీమిండియా

Mana Telangana

Mana Telangana

Author 2019-11-05 02:46:55

img

చెత్త ప్రదర్శనపై వెల్లువెత్తిన విమర్శలు

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి ట్వంటీ20లో భారత జట్టు ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌తో పోల్చితే చాలా బలహీనంగా కనిపిస్తున్న బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచింది. స్టార్ ఆటగాడు షకిబ్ లేకుండానే బరిలోకి దిగిన బంగ్లా తొలి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది.

దీంతో భారత్ కనీస పోటీ కూడా ఇవ్వకుండానే మ్యాచ్‌ను కోల్పోయింది. ఇక, ఏమాత్రం అంచనాలు లేని బంగ్లాదేశ్ తనకంటే ఎంతో మెరుగ్గా ఉన్న భారత్‌పై అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు భారత జట్టు ప్రదర్శనపై ఇటు అభిమానులు, అటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో జట్టు విఫలమైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో భారత్ ఆట ఇలా ఉండడం ఆందోళన కలిగించే పరిణామమేనని వారంటున్నారు. ఇక, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. జట్టును ముందుండి నడిపిస్తాడని భావించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఇటు బ్యాట్స్‌మన్‌గా అటు కెప్టెన్‌గా రోహిత్ ప్రభావం చూపలేక పోయాడు. శిఖర్ ధావన్ కాస్త బాగానే ఆడిన అతని బ్యాటింగ్‌లో వేగం మందగించింది. ఇక, వికెట్ కీపర్ రిషబ్ పంత్, లోకేశ్ రాహుల్‌లు తమ చెత్త బ్యాటింగ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించారు. ఇద్దరికి ఇప్పటికే ఎన్నో అవకాశాలు లభిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. జట్టుకు అండగా నిలువడంలో విఫలమవుతున్నారు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా నిరాశ పరిచాడు.

అతను కూడా జట్టుకు ఆదుకోలేక పోయాడు. యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్ ధాటికి చేతులెత్తేసింది. ఇలాగే ఆడితే రానున్న రోజుల్లో యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కాపాడు కోవడం కష్టమవుతుందనే చెప్పక తప్పదు. కాగా, ఈ మ్యాచ్‌లో బౌలింగ్ కూడా చాలా చెత్తగా సాగింది. ఖలీల్ అహ్మద్ ఒకే ఓవర్‌లో నాలుగు బౌండరీలు సమర్పించుకుని జట్టు ఓటమికి కారకుడయ్యాడు.

అయితే చాహల్, వాషింగ్టన్ సుందర్‌లు పొదుపుగా బౌలింగ్ చేయడం జట్టుకు కాస్త ఊరటనిచ్చే అంశం. ఇక, రానున్న రెండు మ్యాచుల్లో భారత్‌కు బంగ్లాదేశ్ నుంచి గట్టి పోటీ తప్పక పోవచ్చు. సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో కూడా నెగ్గాల్సిన ఒత్తిడి భారత్‌పై నెలకొంది. ఒత్తిడిని తట్టుకుని టీమిండియా ముందుకు సాగడం ఆనుకున్నంత తేలిక కాదు. దీని కోసం సమష్టిగా పోరాడక తప్పదు. అప్పుడే విజయంతో పాటు సిరీస్ దక్కుతుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD