తొలిసారి ట్రయల్స్‌లో నిరాశే ఎదురైంది
ముంబై: ప్రపంచ క్రికెట్లో దిగ్గజ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి సెలెక్షన్ ట్రయల్స్‌కు వెళ్లినప్పుడు ఎవరూ ఎంపిక చేయలేదట. దీంతో మరింతగా కష్టపడి అనుకున్నది సాధించానని తెలిపాడు. ‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలాగైనా భారత జట్టుకు ఆడాలని పరితపించేవాడిని. 11 ఏళ్ల వయస్సులో నా క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది. అయితే మొదటిసారి సెలెక్షన్ ట్రయల్స్‌కు వెళ్లినప్పుడు నన్ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అంతేకాకుండా మరింత కష్టపడి ఆటను మెరుగుపర్చుకోవాలని సలహా ఇచ్చారు. అప్పుడు నేను మెరుగ్గానే బ్యాటింగ్ చేసినప్పటికీ ఎంపిక కానందుకు చాలా నిరాశపడ్డా. అయితే ఆ కసితో క్రికెట్‌పై అంకితభావం మరింతగా పెరిగింది’ అని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ తెలిపాడు. అలాగే తన సక్సె్‌సకు కోచ్ అచ్రేకర్‌తో పాటు కుటుంబసభ్యుల సహకారం కారణమని చెప్పాడు. తన సోదరి తొలిసారిగా క్రికెట్ బ్యాట్ కొనిచ్చిందని గుర్తుచేసుకున్నాడు. సచిన్ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు అతను ఈ స్కూల్‌కు మంజూరు చేసిన నిధులతో మూడు తరగతి గదులను నిర్మించారు.