తొలి పంచ్‌ ఎవరిదో?

Prajasakti

Prajasakti

Author 2020-01-14 13:03:00

img

- నేడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ప్రారంభం
- మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
గత ఏడాది ఆసీస్‌ జట్టు భారత పర్యటనకు వచ్చి వన్డే సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఏడాది తర్వాత మరోసారి పటిష్ట కంగారూ జట్టు మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు భారత్‌కు విచ్చేసింది. వన్డే సిరీస్‌ను చేజిక్కించుకుంటామని ఇరుజట్ల కెప్టెన్లు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీ అనంతరం ఆడిన అన్ని టోర్నీల్లోనూ ఇరుజట్లు సిరీస్‌లను కోల్పోలేదు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆసీస్‌ పర్యటనలో డే/నైట్‌ టెస్ట్‌కు సిద్ధం: కోహ్లీ
ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్‌ పర్యటనకు వెళ్లే భారతజట్టు డే/నైట్‌ టెస్ట్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సోమవారం స్పష్టం చేశాడు. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో మేం తొలి డే/నైట్‌ టెస్ట ఆడాం. ఈ మ్యాచ్‌ సాగిన తీరు ఆనందాన్ని కలిగించింది. ఏ టెస్ట్‌ సిరీస్‌కైనా డే/నైట్‌ టెస్ట్‌లు ప్రధాన ఆకర్షణగా మారింది. భవిష్యత్‌లో ఆ ఛాలెంజ్‌ను ఎదుర్కొనేందుకు మేం సిద్ధం. ఈ విషయంలో బిసిసిఐ-సిఏ ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విరాట్‌ చెప్పుకొచ్చాడు.

ముంబయి: ప్రపంచకప్‌ టోర్నీలో ఇరుజట్లు సెమీఫైనల్లో పరాజయాలను చవిచూశాయి. కానీ ఆ తర్వాత జరిగిన సిరీస్‌లలో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ప్రత్యర్ధులపాలిట సింహస్వప్నంలా మారాయి. వన్డే ప్రపంచకప్‌ అనంతరం జరిగిన సిరీస్‌లలో ఇరుజట్లు ప్రత్యర్ధి జట్లను ఓడించి ట్రోఫీలను కైవసం చేసుకున్నాయి. ఈ క్రమంలో బలీయజట్ల మధ్య మంగళవారం వాంఖడే వేదికగా తొలి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు విచ్చేసింది. స్వంత వేదికపై జరిగే ఈ సిరీస్‌లో కోహ్లీసేన ఫేవరేట్‌గా ఉండగా.. ఆస్ట్రేలియాజట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2019 ఫిబ్రవరి-మార్చి నెలలో ఆసీస్‌ జట్టు భారత్‌లో పర్యటించింది.
రెండు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆసీస్‌.. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకొని కోహ్లీసేనకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.
సమ ఉజ్జీల సమరం...
స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌ను సమఉజ్జీల పోటీగా అభివర్ణించొచ్చు. రోహిత్‌ శర్మ-డేవిడ్‌ వార్నర్‌, విరాట్‌ కోహ్లీ-స్టీవ్‌ స్మిత్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌లో రిషబ్‌ పంత్‌-అలెక్స్‌ క్యారీల మధ్య పోరుగా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో భారత్‌- ఆసీస్‌జట్లు బలీయంగానే ఉన్నాయి. ఇటీవల జరిగిన టెస్టుల్లో ఆసీస్‌ బ్యాట్స్‌ మన్‌ మార్నస్‌ లబూ షేన్‌ వరుస శతకాలతో రాణించి వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించిన లబూషేన్‌ వన్డే ఫార్మాట్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే టీమిండియా జట్టులో యువ ఆల్‌రౌండర్లు శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌ రాణిస్తుండడం భారత్‌కు కలిసొచ్చే అంశం.
టాస్‌ కీలకం...
తొలి వన్డే జరిగే వాంఖడే స్టేడియంలో టాస్‌ గెలిస్తే ఎవరైనా తొలుత బ్యాటింగ్‌ చేసేందుకే మొగ్గు చూపుతారు. రాత్రిపూట మంచు ప్రభావం వల్ల లక్ష్య ఛేదన కష్ట మయ్యే అవకాశముంది. అదీగాక తేమ కారణంగా బంతి బ్యాట్స్‌ మన్‌ను చిక్కడం కష్టం గా మారే అవకా శముంది. టీమిం డియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ధోనీ గైర్హాజరీ నేపథ్యంలో కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ల మధ్య అవగాహన ఎంతైనా అవసరం.
ఇక బౌలింగ్‌ విషయానికొస్తే టీమిండియా జట్టులో జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైనీ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇక మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌ ఉండనే ఉన్నారు.

భారతజట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, చాహల్‌, శిఖర్‌ ధావన్‌, శివమ్‌ దూబే, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, కేదర్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, కెఎల్‌ రాహుల్‌, నవదీప్‌ సైనీ, మహ్మద్‌ షమి, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌.
ఆస్ట్రేలియాజట్టు: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), అలెక్స్‌ క్యారీ, పాట్‌ కమ్మిన్స్‌, అస్టన్‌ అగర్‌, హ్యాండ్స్‌కోంబ్‌, హేజిల్‌వుడ్‌, లబూషేన్‌, రిచర్డుసన్‌, ఆర్సీ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మిఛెల్‌ స్టార్క్‌, ఆర్నెర్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జంపా.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN