దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. భారత్ లక్ష్యం 248

mykhel

mykhel

Author 2019-10-11 16:08:56

img

వడోదర: వడోదరలోని రిలయన్స్‌ స్టేడియంలో శుక్రవారం భారత మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా మహిళలు భారీ పరుగులు చేసారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి.. టీమిండియా ముందు 248 పరుగుల లక్ష్యంను ఉంచింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు లిజెల్ లీ (40), లారా వోల్వార్డ్ (69; 98 బంతుల్లో, 7ఫోర్లు) .. మిగ్నాన్ డు ప్రీజ్(44) రాణించారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఓపెనర్లిద్దరూ ఆచితూచి ఆడుతూ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. అయితే 16వ ఓవర్లో పూనమ్ యాదవ్.. లీని ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచింది. అనంతరం వోల్వార్డకు త్రిష చెట్టి మంచి సహకారం అందించింది. దీంతో ప్రొటీస్ 100 పరుగుల మార్క్ చేరింది. ఈ దశలో పేసర్ శిఖా పాండే విజృంభించి వోల్వార్డ్, త్రిష (22)లను ఔట్ చేసింది.

భారత బౌలర్లను డు ప్రీజ్, లారా గూడాల్ (38) సమర్ధంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. గూడాల్ బౌండరీలతో చెలరేగడంతో ప్రొటీస్ 200 పరుగులు దాటింది. ఈ సమయంలో డు ప్రీజ్, లారాలను ఏక్తా బిస్త్ పెవిలియన్ చేర్చింది. ఇన్నింగ్స్ చివరలో సునే లూస్ (12), మారిజాన్ కాప్ (11) ధాటిగా ఆడడంతో దక్షిణాఫ్రికా మహిళలు 247 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శిఖా పాండే, ఏక్తా బిస్త్ తలో రెండు వికెట్లు సాధించారు.

భారీ లక్ష్య చేధనకు దిగిన భారత్ బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు ప్రియా పూనియా (5), రోడ్రిగ్స్‌ (13) క్రీజులో ఉన్నారు. భారత్ 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 20 పరుగులు చేసింది. భారత్ విజయానికి 228 పరుగులు కావాలి. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో టీమిండియాకు ఈ స్కోర్‌ ఛేదించడం పెద్ద కష్టమేమి కాదు. తొలి వన్డేలో ఓడిన దక్షిణాఫ్రికా మహిళలు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే భారత్ టీ20 సిరీస్‌ గెలిచిన విషయం తెలిసిందే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN