ధరల స్థిరీకరణతో రైతులకు వెసులుబాటు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-22 05:51:10

img

అమరావతి, అక్టోబర్ 21: రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని రాష్ట్ర మార్కెటింగ్, పశు, మత్స్యశాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన అనతి కాలంలోనే సంక్షేమ పథకాల అమలు, రైతులను ఆదుకునేందుకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చారన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలుచేస్తూనే మరోవైపు రైతాంగ సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక అజెండాను రూపొందించారని తెలిపారు. ప్రతి నెలా రైతుల శ్రేయస్సుపై సమీక్ష జరుపుతున్నామన్నారు. పంటల గిట్టుబాటు ధర కోసం ఇప్పటికే రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, ఆ పరిధిలోకి రాని సెనగ, టమోటా, ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. రాయలసీమ జిల్లాల్లో సెనగ పంట వేసి నష్టపోయిన ఐదెకరాలలోపు సన్న, చిన్నకారు రైతులకు రూ. 45వేల చొప్పున అదనపు ఆర్థిక సహాయం అందించిన ఘనత ప్రభుత్వానిదే అన్నారు. రాష్టవ్య్రాప్తంగా 63వేల మంది సెనగ రైతుల వివరాలను పరిశీలించి 30 వేల మంది రైతులకు త్వరలో నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ-క్రాప్ బుకింగ్ విధానానికి వీలులేని సెనగ రైతులు మరో పంట పేరుతో సాగుచేసి గోదాములలో పంటలను నిల్వ చేసుకుని ధరలులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఈ-క్రాప్ విధానంతో నిమిత్తం లేకుండా గోదాముల్లో నిల్వచేసుకున్న పంటలను పరిశీలించి వాటికి గిట్టుబాటు ధరలతో సంబంధం లేకుండా పరిహారం అందించాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. ఉల్లి ధరలు అమాంతం పెరిగినందున దళారులు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. వెంటనే మహారాష్ట్ర, కర్నూలు జిల్లాల నుంచి కిలో రూ. 32 చొప్పున కొనుగోలు చేసి రాష్టవ్య్రాప్తంగా 85 రైతుబజార్ల ద్వారా కేవలం రూ. 25కే అందించామని గుర్తుచేశారు. ఇటీవల కర్నూలు జిల్లా పత్తికొండలో దళారుల వ్యవస్థ వల్ల టమోటా ధరలు గణనీయంగా తగ్గాయని గుర్తించిన ప్రభుత్వం మార్కెటింగ్ విభాగాల ద్వారా కొనుగోలు చేసి తిరుపతి, ఆదోని, ఇంకా పలు ప్రాంతాల్లో వినియోగదారులకు కిలో రూ. 11కే అందించిందని తెలిపారు. దళారీ వ్యవస్థ ద్వారా రైతులు నష్టపోకుండా ఉండేందుకు మినుము, పెసర, సెనగలకు నష్ట నివారణకు రూ. 100 కోట్ల నిధులు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. మార్క్‌ఫెడ్ ద్వారా గోదాముల్లో నిల్వ చేశామన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సుబాబుల్ పంటలు వేసిన రైతులు దఱారుల కారణంగా మోసపోవటంతో వారికి రూ. 7.5 కోట్ల ఆర్థిక సాయం అందించామని చెప్పారు. క్రమశిక్షణతో ముఖ్యమంత్రి ఆర్థిక రంగ ప్రక్షాళన చేస్తున్నారనటానికి ఇవే నిదర్శనాలన్నారు. గత ప్రభుత్వం రూ. 5వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినప్పటికీ రూ. 5 కోట్లు కూడా ఖర్చు చేయకుండా రైతుల్ని మోసగించిందని విమర్శించారు. అస్తవ్యస్త పాలనతో అదుపుతప్పిన ఆర్థిక రంగాన్ని గాటన పెట్టేందుకు సీఎం జగన్ అహరహం శ్రమిస్తున్నారని తెలిపారు. కూరగాయలు, పండ్లతోటలు డీ నోటిఫై చేయటం వల్ల గతంలో మార్కెట్ యార్డుల్లో దళారుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తమ ప్రభుత్వం పంటల నిర్దిష్ట ప్రణాళికతో వ్యవసాయ మిషన్ ఏర్పాటుచేసి వాటిని సరిదిద్దుతోందని వివరించారు. అవసరమైతే పీపీఏ విధానంలో రైతులకు మేలేచేసే విధానాలపై పరిశీలన జరుపుతున్నామని తెలిపారు. గతంలో సీసీఎల్‌ఎ పత్తి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మార్కెట్ యార్డుల ద్వారా అధికారులే స్వయంగా రైతుల వద్దకు వెళ్లి పత్తి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.

*చిత్రం...మంత్రి మోపిదేవి

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD