ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ అనవసరం

Prajasakti

Prajasakti

Author 2019-10-27 11:03:33

img

- టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ అనవసరమని, ఆయనపై కామెంట్లు ఆపాలంటూ కోచ్‌ రవిశాస్త్రి మండిపడ్డాడు. ధోనీ రిటైర్మెంట్‌ గురించి మాట్లాడేవారిలో సగంమందికి క్రికెట్‌ షూలేస్‌ కూడా కట్టుకోవడం చేతకాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహేంద్రసింగ్‌ ధోనీ టీమిండియాకు 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, భారత్‌కు రెండు దశాబ్దాల అనంతరం ఐసిసి వన్డే ప్రపంచకప్‌ అందించిన ఘనత ధోనీ సొంతమని రవిశాస్త్రి ఈ సందర్భంగా గుర్తుచేశాడు. అలాగే ధోనీ సారథ్యంలోనే టీమిండియా ం టీ20 ప్రపంచకప్‌ను గెల్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. క్రికెట్‌కు ధోని ఎప్పుడు రిటైర్మెంట్‌ ఇవ్వాలో అతనికే ఆ స్వేచ్ఛను వదిలేయాలని సూచించారు. ధోనీ రిటైర్మెంట్‌పై వ్యాఖ్యలు చేయడమంటే ఆయనను అవమానించినట్లేనని, ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని వారు ఎందుకు తహతహలాడుతున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. మాజీ క్రికెటర్లు చర్చించుకోవడానికి ధోనీ రిటైర్మెంట్‌ విషయం తప్ప ఇతర విషయాలేమీ లేవా? అని కూడా ఈ సందర్భంగా ఘాటుగా విమర్శించాడు. ధోనీ టీమిండియాకు సమర్థుడైన నాయకుడని నిరూపించుకోవడంతో పాటు అతని అమూల్యమైన సలహాలు జట్టుకు ఎంతో ఉపయుక్తం కానున్నాయని, దీంతో తను నచ్చినప్పుడు రిటైర్మెంట్‌ను ప్రకటించే హక్కును సంపాదించాడని తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఐసిసి వన్డే ప్రపంచకప్‌ అనంతరం ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ స్వచ్ఛందంగా రిటైర్మెంట్‌ ప్రకటించాలని మాజీ క్రికెటర్లు చర్చను లేవనెత్తారు. వన్డే ప్రపంచకప్‌ అనంతరం టీమిండియా పర్యటించిన వెస్టిండీస్‌ టూర్‌కు, స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ధోనీ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించడానికి జార్ఖండ్‌ అండర్‌-23 జట్టుతో కలిసి సాధన చేసే అవకాశమున్నట్లు తెలిసింది.
గంగూలీ ఎన్నిక శుభసూచికం
బిసిసిఐ అధ్యక్షునిగా సౌరవ్‌ గంగూలీ ఎన్నికవ్వడం భారత క్రికెట్‌ సరైన మార్గంలో వెళ్తుందనడానికి శుభసూచికమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టిన గంగూలీని ఈ సందర్భంగా రవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ అయిన గంగూలీ రిటైర్మెంట్‌ అనంతరం నాలుగు సంవత్సరాలనుంచి బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యకలాపాల్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. భారత క్రికెట్‌కు ఇది మంచి పరిణామమని తెలిపాడు. ప్రస్తుత బిసిసిఐ కష్టకాలంలో ఉందని, దాదా బిసిసిఐను గాడిలో పెట్టాలని అవసరమెంతైనా ఉందన్నారు. అలాగే ఐసిసిపై ఆధిపత్యం చెలాయించే శక్తి భారత్‌కు ఉందని ఈ సందర్భంగా రవి గుర్తుచేశాడు. ప్రస్తుతం మన క్రికెట్‌ బోర్డు సమర్ధులైన వ్యక్తుల చేతుల్లో ఉందని, వారికి ఏమి చేయాలో కూడా బాగా తెలుసన్నాడు. అలాగే రాహుల్‌ ద్రావిడ్‌ను 'జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సిఏ)లో ఉండడం భారత క్రికెట్‌కు ఎంతో దోహదం చేస్తుందన్నారు. అధ్యక్షుడిగా దాదా... ఎన్‌సిఏలో ద్రావిడ్‌ ఇంతకంటే గొప్ప భాగస్వామ్యం ఆశించగలమా? అని పేర్కొన్నాడు.

బిసిసిఐ అధ్యక్షునిగా ఎన్నికైన గంగూలీని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ శుక్రవారం సన్మానించింది. ఈ కార్యక్రమంలో గంగూలీకి శుభాకాంక్షలు తెలుపుతున్న హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అజారుద్దీన్‌, మాజీ క్రికెటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌.

imgimg
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN