నాన్నే నా సూపర్ హీరో
ముంబై: తన తండ్రి నిర్ణయాల వల్లే కెరీర్ ఇంత అద్భుతంగా సాగుతున్నదని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఎప్పటికీ తన సూపర్‌హీరో ఆయనే అని చెప్పాడు. కోహ్లీపై సూపర్ వీ పేరుతో స్టార్‌స్పోర్ట్స్‌లో ఓ యానిమేటెడ్ సిరీస్ వచ్చే నెల 5న అతడి పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభం కానుంది. శనివారం జరిగిన ఈ సిరీస్ ఆవిష్కరణ కార్యక్రమంలో కోహ్లీ పాల్గొని, తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. చాలా మంది మనకు స్ఫూర్తిని ఇవ్వొచ్చు. కానీ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తూ స్ఫూర్తి, ప్రేరణ కలిగించడం వేరు. నాకు ఆయన(నాన్న) ప్రత్యక్ష ఉదాహరణగా ఉంటూ ఎంతో ప్రేరణనిచ్చారు. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు.. ఆయన తీసుకున్న నిర్ణయాలే నా కెరీర్‌ను నిర్దేశించాయి. సొంత కష్టంతోనే ముందుకు సాగాలని, మరో మార్గం లేదని నాకు ఆయన వ్యక్తిత్వం వల్లే అర్థమైంది. దానిపైనే ఎక్కువగా దృష్టి సారించా. అందుకే ఆయనే నా సూపర్ హీరో. ఒకవేళ నేను విజయం సాధిస్తే.. అది నా విధి. విఫలమైతే.. అవసరమైనంత కష్టపడలేదని అర్థం. దీన్ని అనుసరించే సాకులు వెతకడం మానేశా. నా జీవితంలో సాధించిన విజయాలన్నీ మా నాన్న వల్లే జరిగాయి అని కోహ్లీ చెప్పాడు.