నేటినుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-01 03:05:44

విజయవాడ, సెప్టెంబర్ 30: రాష్ట్రంలో మంగళవారం నుంచి మద్య విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుంది. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి, పని వేళలను కూడా తగ్గించింది. మద్య మహమ్మారిని నిర్మూలించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మద్యం దుకాణాల తగ్గింపుపై దృష్టి సారించింది. ఇప్పటికే బెల్ట్ షాపులను లేకుండా చేసిన ప్రభుత్వం మద్యం దుకాణాలను 4380 నుంచి 3500కు తగ్గించింది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది. కొత్త మద్యం విధానంలో పర్మిట్ రూమ్ విధానాన్ని తొలగించింది. దీంతో మద్యం దుకాణాల వద్ద మద్యాన్ని తాగే వీలు ఉండదు. దీంతో మద్యం దుకాణాల చుట్టుపక్కల మందుబాబుల హడావుడి ఉండదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అధికార, అనధికార పర్మిట్ రూమ్‌లతో మద్యాన్ని దుకాణాల వద్దే తాగేవారు. ఇప్పుడు మద్యం కొనుగోలు చేసి దుకాణాల వద్ద తాగేందుకు వీలుండదు. ఇకపై మందుబాబులు ఏం చేస్తారో చూడాలి. మద్యం దుకాణ పనివేళలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ తెరిచి ఉండేలా మద్యం విధానంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ తాజాగా సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో మద్యం దుకాణాల పని వేళలను మరింతగా కుదించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. మద్యం దుకాణాలు, బార్లపై మహిళలు చేసే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఇలాఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన 14,944 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్న విషయం తెలిసిందే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN