నేటి నుంచి సీఆర్‌ఎం బృందాల తనీఖీలు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-17 02:33:37

విశాఖపట్నం: గ్రామ స్థాయిలో ప్రజలకు ఏ విధమైన వైద్య సేవలు అందుతున్నాయి? అనే విషయాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖకు అందించే నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో అనే విషయాలపై పరిశీలన చేసేందుకు కామన్ రివ్యూ మిషన్ (సీఆర్‌ఎం) బృందాలు ఏపీలో పర్యటించనున్నాయి. నేషనల్ హెల్త్ మిషన్‌తో పాటుగా పనిచేసే ఈ బృందాలు ఏపీలోని తొలి విడతలో విశాఖ, కడప
జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. జిల్లాకు 20 మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఈ నెల 17నుంచి 20 వరకూ పర్యటించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో నడుస్తున్న ఆసుపత్రులతో పాటు, మిగిలిన ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లోనూ తనిఖీలు నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రంలోనే హైరిస్క్ జిల్లాగా పేరొందిన విశాఖ జిల్లాలోనే అత్యధికంగా మాతా, శిశు మరణాలు, సాధారణ వ్యాధులతో పాటు, సీజనల్ వ్యాధులు కూడా అధికంగా నమెదవుతున్న నేపథ్యంలో ఈ బృందాలు నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, పొరుగు రాష్ట్రాల నుంచి విశాఖ కేజీహెచ్‌కు వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలపై సీ ఆర్ ఎం ప్రతినిధుల బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నారు. నాలుగేళ్లకు ఒక సారి పర్యటించే ఈ బృందాలు జిల్లాకు వస్తున్నాయనే సమాచారంతో జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.గత సారి వచ్చిన సమయంలో కేజీహెచ్‌లోని లేబర్ రూమ్ నిర్వహణపై సీఆర్‌ఎం ప్రతినిధుల బృందం అసంతృప్తి వ్యక్తం చేయగా నాలుగు రోజుల్లోనే లేబర్ రూమ్‌కు ఆగమేఘాలపై మరమ్మతులు చేపట్టడం విశేషం. గత సారి పర్యటనలో సీఆర్‌ఎం బృందం కేజీహెచ్‌లోని గుర్తించిన లోపాల కారణంగానే నేటి వరకూ కేంద్రం నుంచి అంతంత మాత్రంగానే నిధులు మంజూరు జరిగాయే తప్ప, ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో సీఆర్‌ఎం బృందం తనిఖీలు నిర్వహిస్తుందనే సమాచారంతో ఇటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో పాటు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్, వైద్య కళాశాల అధికారులు మందస్తుగానే అప్రమత్తమయ్యారు. ఇదే సందర్భంలో కమిటీ నాలుగు రోజుల పర్యటనలో ఎటువంటి లోపాలను గుర్తిస్తుందోనేని భయంతో ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారు. ఈ సీఆర్‌ఎం బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర నిధులతో పాటు, ఆయా ఆసుపత్రుల అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉండటంతోనే హడలిపోతున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN